Ajay Banga: పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల మధ్య ‘‘ప్రపంచ బ్యాంక్’’ అధ్యక్షుడు అజయ్ బంగా గురువారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. పాకిస్తాన్, పీఓకేలలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన ఒక రోజు తర్వాత ఆయన మోడీని కలిశారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పింది. ఈ ఆపరేషన్ తర్వాత గురువారం పాకిస్తాన్ 15 భారతీయ నగరాలపై క్షిపణి దాడికి యత్నించింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని నిర్వీర్యం చేసింది. ఈ వరస పరిణామాల నేపథ్యంలో అజయ్ బంగా ప్రధానిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ ఖాన్ నేతృత్వంలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. భారత్ పైకి పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోసినా, యుద్ధాలు చేసినా ఎప్పుడూ కూడా ఈ ఒప్పందాన్ని నిలిపేయలేదు. అయినా తీరు మార్చుకోని పాకిస్తాన్ ఇటీవల పహల్గామ్‌లో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని చంపేసింది. దీనికి రివేంజ్‌గా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని కొనసాగిస్తోంది.
Read Also: Nayanathara : నయనతారను కలిసేందుకు వెళ్లిన అనిల్ రావిపూడి
సింధు జలాల ఒప్పందం నిలిపేసిన తర్వాత, భారత్ చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యాం, సలాల్ డ్యాం గేట్లను దించేసి నీటిని స్టోర్ చేస్తోంది. దీనిపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఇప్పటికే, నీటికి అడ్డుకట్ట పడటంతో పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్ వద్ద నదీ ప్రవాహం తగ్గింది. అయితే, ఇది జరిగిన కొన్ని రోజులకే ఒక్కసారిగా గేట్లు ఎత్తేయడంతో పాకిస్తాన్‌లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో బంగా భారత ప్రధానిని కలిశారు. రేపు ఆయన ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. యూపీ 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అజయ్ బంగా పర్యటన కీలకంగా మారింది.