Bharat Jodo Yatra: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం తన మెగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర పార్టీ పునరుజ్జీవనానికి దోహదపడుతుందని జి-23 నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. భారత్ జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబుదూర్‌లోని తన తండ్రి రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర కాశ్మీర్‌లో ముగుస్తుంది. ఇది 12 రాష్ట్రాలలో 3,500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది, పూర్తి చేయడానికి దాదాపు 150 రోజులు పడుతుంది. ఐదు నెలల పాటు సాగే ఈ యాత్ర 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు కాంగ్రెస్ వ్యూహంగా పరిగణించబడుతుంది.
గత కొన్ని నెలలుగా జీ-23 నాయకులు అనేక మంది పార్టీని సంస్థాగతంగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుతున్న పరిస్థితి, దాని పరిస్థితులను ఎలా మెరుగుపరచాలనే దానిపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2020 ఆగస్టులో సోనియా గాంధీకి రాసిన లేఖలో జీ-23 అని పిలువబడే కాంగ్రెస్ సభ్యుల బృందం పార్టీని నడిపే విధానంలో గణనీయమైన మార్పులను కోరింది. వారు స్పష్టమైన నాయకత్వంతో పాటు కాంగ్రెస్‌ను సమగ్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తన వ్యవహారాలను ఎలా నడుపుతుందనే ఫిర్యాదుల కారణంగా గత ఏడాది కాలంలో చాలా మంది నేతలు పార్టీని వీడారు. గత నెలలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ జీ-23 సభ్యుడు గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ గ్రూపులోని మరో ప్రముఖుడు కపిల్ సిబల్ ఈ ఏడాది మేలో పార్టీని వీడారు. జీ-23 సభ్యుడు జితిన్ ప్రసాద గతేడాది పార్టీని వీడారు.
ఇటీవల కొంతమంది జీ-23 నాయకులను మినహాయించి చాలా మంది ప్రముఖులు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో సెప్టెంబర్ 4న జరిగిన కాంగ్రెస్ “మెహంగై పర్ హల్లా బోల్” ర్యాలీకి హాజరు కాలేదు. ఆ ర్యాలీకి ఇద్దరు కీలక జీ-23 నేతలు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ గైర్హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, భూపిందర్ సింగ్ హుడా వంటి ఇతర జీ-23 నేతలు హాజరయ్యారు. నేటి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం కావడంతో జీ-23 నాయకులు అనేక మంది తరలివచ్చినట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ జోరు ముందు నిలబడలేని పార్టీ.. కొత్త పుంతలు తొక్కుతున్నట్లుగా అనిపిస్తోంది. ప్రధాని మోడీకి దీటుగా సమాధానం చెప్పే విధంగా కాంగ్రెస్ దూసుకెళ్తున్నట్లుగా ఈ యాత్ర ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం రేకెత్తించింది.
కాంగ్రెస్‌లోని ప్రముఖ జీ-23 నాయకుడు ఆనంద్ శర్మ భారత్ జోడో యాత్రకు మద్దతు తెలపడం పార్టీకి ఉపశమనం కలిగించింది. “రాహుల్ గాంధీకి, యాత్రికులందరికీ నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్ర అన్యాయం, అసమానత, అసహనానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి, భారతదేశ సమగ్ర ప్రజాస్వామ్యాన్ని సమర్థించే లక్ష్యం. జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి కూడా ఈ యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. జమ్మూకశ్మీర్ వెళ్లే మార్గంలో తన స్వస్థలమైన హిమాచల్‌కు సమీపంలోకి చేరుకున్నప్పుడు యాత్రలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నట్లు ఆనంద్ శర్మ వెల్లడించారు.
Rahul Gandhi: మతచిచ్చు పెట్టి బీజేపీ దేశాన్ని విభజించాలని చూస్తోంది.. రాహుల్ విమర్శలు
మరో G-23 సభ్యుడు, ఇటీవలి సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిన రాజ్ బబ్బర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, ”భారత్ జోడో యాత్రకు శుభాకాంక్షలు. దేశం, కాంగ్రెస్ రెండింటినీ అనుసంధానించే దిశలో ఈ ప్రయత్నం ముఖ్యమైనదని నిరూపించబడుతుందని భావిస్తున్నాను.” అని అన్నారు.
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, జీ-23 సభ్యుడు, రాబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిన శశి థరూర్.. ఈ యాత్ర ‘భారత్ జోడో’, ‘కాంగ్రెస్ జోడో’ రెండింటినీ సాధించగలదని అన్నారు. ఈరోజు ఆయన భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ ట్వీట్‌తో పాటు దినకర్ కవిత పంక్తులను ట్వీట్ చేశారు.
మరో G-23 సభ్యుడు ముకుల్ వాస్నిక్ సెప్టెంబర్ 6న ట్విట్టర్‌లో ఇలా వ్రాశాడు. “దేశంలో ద్వేషానికి ఐక్యంగా సమాధానం ఇద్దాం. భారత్ జోడోయాత్రలో చేరి దేశం గర్వించేలా కలిసి అడుగులు వేద్దాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో, వివక్ష సంకెళ్లను తెంచుకుంటాము. ప్రేమ, సామరస్య సందేశాన్ని అందిస్తాము. దేశాన్ని బలోపేతం చేస్తాము.” భారత్ జోడో యాత్ర నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ యాత్రతో వచ్చిన జోష్‌తో కాంగ్రెస్ దూసుకెళ్తుందో లేదో వేచి చూడాల్సిందే.