Rahul Gandhi: తమిళనాడుకు తనకు ఎంతో అనుబంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తమిళనాడులో కన్యాకుమారి వద్ద ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన అనంతరం గాంధీ మండపం వద్ద బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. భారత్ జోడో యాత్రకు ఇక్కడి సముద్రం, ఆహ్లాదకర వాతావరణం జోష్ నింపుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా ఏదో లోటు వుందని ప్రజలు భావిస్తున్నారని రాహుల్ అన్నారు. సగర్వంగా తలెత్తుకుని వున్న ఇక్కడి జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు.
జాతీయ జెండా అంటే కేవలం మూడు రంగులు కావని.. దేశంలోని ప్రతి పౌరుడి స్వేచ్ఛకు ప్రతీక అని రాహుల్ అన్నారు. జాతీయ జెండా అన్ని రాష్ట్రాల సమైక్యతకు చిహ్నమని.. భారత్ అంటే సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలపై దాడులు చేస్తోందని.. సీబీఐ, ఈడీలను విపక్షాలపై అస్త్రాలుగా వాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇటువంటి దాడులకు భయపడమని రాహుల్ తేల్చిచెప్పారు. మతచిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని బీజేపీ భావిస్తోందని.. భారత్ ఇప్పుడు అత్యంత దుర్భర ఆర్థిక సంక్షోభాన్ని చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను కేంద్ర సర్కారు దుర్వినియోగం చేస్తోందని.. మీడియాలో ఎక్కడా ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభంపై వార్తలు రావని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ధ్వజమెత్తారు. అంతా మోడీ భజనేనని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకుండా అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మీడియాను నియంత్రణలో పెట్టుకుని 24 గంటలూ మోడీనే దర్శనమిస్తున్నారని.. మత రాజకీయాలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు మూడు కార్పోరేట్ సంస్థలు దేశాన్ని నియంత్రిస్తున్నాయని… జీఎస్టీ, పన్నుల భారంతో రైతులు, సామాన్యులు విలవిలలాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత నిరుత్సాహంలో వున్నారని.. దేశంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం అసాధ్యం కాదన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే భారత్ జోడో యాత్ర ఉద్దేశమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Bharat Jodo Yatra: కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా… రాహుల్ గాంధీ తన సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ చేతికి త్రివర్ణ పతాకాన్ని అందించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాజస్ధాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ సహా పలువురు నేతల సమక్షంలో గాంధీ మంటపం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రాహుల్ వెంట 59 ట్రక్కులతో పాటు 118మంది కాంగ్రెస్ నేతలు కూడా పయనమయ్యారు. మిలే కదం…జుడే వతన్ నినాదంతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇక పాదయాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌ను సందర్శించారు. మరోవైపు శ్రీపెరంబదూర్‌లో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకం వద్ద నివాళి అర్పించారు. విద్వేష, విభజన రాజకీయాలకు తన తండ్రి బలయ్యాడని, కానీ అటువంటి విద్వేష రాజకీయాలకు దేశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని రాహుల్ ఇవాళ ట్విట్టర్‌లో తెలిపారు