India’s Defence Exports: భారతదేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ గా మారాలని భావిస్తోంది. సొంతంగా ఆయుధాలు, రక్షణ రంగ పరికరాలను తయారు చేసుకుంటోంది. గత కొన్నేళ్ల వరకు భారత్ తన రక్షణ రంగ అవసరాల కోసం ఎక్కువగా రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలపై ఆధారపడుతూ వచ్చింది. అయితే గత కొన్నేళ్లుగా భారత్ సొంతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే కాకుండా మనదేశంలో తయారైన రక్షణ పరికరాలను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది.
201-2014 లో కేవలం రూ. 686 కోట్లుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2022-23లో దాదాపుగా రూ.16,000 కోట్లకు చేరుకుని ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఏకంగా 23 రెట్లు రక్షణ ఎగుమతులు పెరిగాయి. ‘‘ఎగుమతులు 85 కంటే ఎక్కువ దేశాలకు చేరుకోవడంతో, భారతదేశ రక్షణ పరిశ్రమ దాని రూపకల్పన మరియు అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది, ప్రస్తుతం 100 సంస్థలు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి’’ అని మంగళవారం ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Manipur Violence: మణిపూర్ హింసాకాండలో చనిపోయిన వారికి రూ.10లక్షలు.. ఇంటికో ఉద్యోగం
రక్షణ ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా అనేక విధానపరమైన కార్యక్రమాలను, సంస్కరణలను చేపట్టింది. ఈజ్ ఆఫ్ డూమింగ్ బిజినెస్ తీసుకురావడానికి ఎండ్-టూ-ఎండ్ ఆన్ లైన్ ఎగుమతి ఆథరైజేషన్, జాప్యాన్ని తగ్గించడంతో ఎగుమతి విధానాలు సరళీకృతం అయ్యాయి. దీంతో రక్షణ పరిశ్రమ ఎగుమతులకు అనుకూలతలు ఏర్పడ్డాయి. ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలు దేశంలో స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి మరియు రక్షణ పరికరాల తయారీని ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలంలో దిగుమతులపై ఆధారపడటం తగ్గింది.
విదేశాల నుంచి రక్షణ కొనుగోళ్లపై 2018-19లో మొత్తం వ్యయంలో 46 శాతం కేటాయిస్తే, 2022 డిసెంబర్ నాటికి 36.7 శాతానికి ఇది తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం భారత్ డోర్నియర్-228 వంటి విమానాలు, ఫిరంగి తుపాకులు, బ్రహ్మోస్ క్షిపణులు, పినాకా రాకెట్లు మరియు లాంచర్లు, రాడార్లు, సిమ్యులేటర్లు, సాయుధ వాహనాలతో సహా అనేక రకాల రక్షణ పరికరాలను గెగుమతి చేస్తోంది. భారత్ తయారు చేసిన LCA-తేజస్, లైట్ కంబాట్ హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు వంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది.