Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఎన్సీపీ అధినేత, మహాయుతిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి విమాన ప్రమాదంలో మరణించారు. అయితే, ఇప్పుడు ఎన్సీపీకి పెద్ద దిక్కు ఎవరు కాబోతున్నారనే ప్రశ్న వినిపిస్తుంది. శరద్ పవార్‌తో విభేదాల తర్వాత, ఎన్సీపీలో చీలిక వచ్చింది. మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు, నేతలు అజిత్ పవార్‌తో ఉన్నారు. వీరంతా ఎన్డీయేలో భాగస్వాములయ్యారు.
అయితే, ఇప్పుడు అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ అధినేతగా ఆయన భార్య సునేత్ర పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజ్య సభ ఎంపీగా ఉన్న ఆమె వైపు అందరి చూపు మళ్లింది. సునేత్ర పవార్ ఎన్సీపీలో, మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద నేతగా మారే అవకాశం ఉంది. మరాఠ్వాడా ప్రాంతంలోని ధారశివకు చెందిన ఆమె, రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ అయిన పద్మ సింగ్ పాటిల్ సోదరి.
1985లో అజిత్ పవార్‌ను వివాహం చేసుకున్న సునేత్ర, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీ చేశారు. ఈ పోటీలో ఆమె 1.5 లక్షల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.
సునేత్ర పవార్ ఎవరు.?
రైతు-రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సునేత్ర, రాజకీయ నాయకురాలిగా, ఒక సామాజిక కార్యకర్త, పారిశ్రామిక, విద్యానిర్వాహకురాలిగా ఉన్నారు. అజిత్ పవార్ నీడ నుంచి బయటకు వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం, బారామతి టెక్స్‌టైల్ కంపెనీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ఎన్విరాన్‌మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (EFOI) వ్యవస్థాపకురాలు కూడా, ఈ స్వచ్ఛంద సంస్థకు ఆమె 2010 నుండి నాయకత్వం వహిస్తున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణ గ్రామాలు మరియు పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. మహారాష్ట్రలో సుస్థిర అభివృద్ధికి ఆమె చేసిన కృషికి గాను ఆమెకు “గ్రీన్ వారియర్ అవార్డు” లభించింది.
2011 నుంచి సునేత్ర ఫ్రాన్స్ లోని వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరమ్‌లో థింక్ ట్యాంక్ సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. శరద్ పవార్ స్థాపించిన విద్యా ట్రస్ట్ అయిన విద్యా ప్రతిష్టాన్ ట్రస్టీగా కూడా ఉన్నారు. ఇది 25,000 మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది. ఆమె 2017 నుంచి సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.
2024లో రాజకీయ ప్రవేశం:
ఎన్సీపీ అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలుగా చీలిపోయిన తర్వాత, తొలిసారిగా సునేత్ర ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సొంత వదిన సుప్రియా సూలేపై బారామతి నుంచి బరిలో దిగారు. ఈ పోరులో సునేత్ర, సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. దీని తర్వాత, కొన్ని రోజులకే ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
అధినేతగా మారే అవకాశం:
ఎన్సీపీలో ప్రస్తుతం సునేత్ర పవార్‌కు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రఫుట్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ వంటి ఇతర ప్రముఖులు ఉన్నప్పటికీ అజిత్ పవార్ భార్యగా ఆమెకు కలిసి వచ్చే అంశం. ప్రజల సానుభూతితో పాటు, అజిత్ పవార్ భార్యగా పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. దశాబ్ధాలుగా ‘‘పవార్’’ పాటిలిక్స్‌లో కొనసాగుతున్న పురుషాధిక్యతను ఈమె బద్ధలుకొట్టే ఛాన్స్ ఉంది. సునేత్ర కుమారుడు పార్థ్ పవార్ నాయకత్వంపై దృష్టి పెట్టవచ్చు.