వాళ్లిద్దరూ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి ప్రేమ ఫలించి రెండు నెలల క్రితం ఏడడుగులు వేశారు. ఇంతలోనే ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ భర్తను ఇల్లాలు కాటికి పంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
జితేంద్ర కుమార్ యాదవ్, జ్యోతి 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి కుటుంబ సభ్యుల అంగీకారంతో నవంబర్ 25, 2025న బరేలీలో వైభవంగా వివాహం జరిగింది. అయితే జితేంద్ర కుమార్ యాదవ్ ఆన్‌లైన్ జూదానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య జ్యోతి బ్యాంక్ ఖాతా నుంచి 20 వేలు విత్‌డ్రా చేసి ఆన్‌లైన్‌లో పెట్టాడు. అవి కాస్త పోయాయి. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరికి అది కాస్త హత్యకు దారి తీసింది.
జనవరి 26న జ్యోతి తన తల్లిదండ్రులకు.. సోదరుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అప్పటికే దంపతులిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి తల్లిదండ్రులు జితేంద్ర చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకోగా. జ్యోతి కోపంతో భర్త గొంతు కోసేయడంతో ప్రాణాలు వదిలేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని వెంటిలేటర్ గ్రిల్‌కు వేలాడిదీసి.. ‘‘అల్లుడు ఉరివేసుకున్నాడు.’’ అంటూ ఇరుగుపొరుగు వారిని పిలిచారు.
ఇక ఇజ్జత్‌నగర్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. రిపోర్టులో హత్యగా తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు నిందితురాలు భార్య జ్యోతి, మామ కాళీచరణ్, అత్తగారు చమేలిలను అరెస్టు చేశారని పోలీస్ అధికారి చెప్పారు. విచారణలో ముగ్గురూ తమ నేరాలను అంగీకరించారని.. పరారీలో ఉన్న జ్యోతి సోదరుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
