ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారు సీఎం కేసీఆర్. జ్వరం కారణంగా హాజరుకాలేదని పార్టీ, ప్రభుత్వ వర్గాలు తెలిపినా దీని వెనుక కారణాలు వున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గత కొంతకాలంగా ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించి విఫలమవుతున్న సీఎం కేసీఆర్.. ఈ పర్యటన సందర్బంగా మోదీతో ఈ రకంగా వ్యవహరిస్తారించారని అంటున్నారు.
మోడీ పేరు చెబితే కేసీఆర్ కు జ్వరం వచ్చిందని సెటైర్లు వేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు ఏం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.జ్వరం వచ్చిందంటూ సాకులు చెప్పి తప్పించుకోవడం సరికాదని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రజలంటే మోడీకి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ స్వాగతం చెప్పాలి. ముందుగా ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం చెబుతారని భావించినప్పటికీ అస్వస్థత కారణంగా షెడ్యూల్ మారినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేసీఆర్‌కి జ్వరంగా ఉండడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రంలో కేసీఆర్ గైర్హాజరు అంశం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కావాలనే ప్రధాని పర్యటనకు డుమ్మా కొట్టారనే విమర్శల వెల్లువెత్తాయి. ఈ విషయంపై సీనియర్ కమ్యూనిస్టు నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కి పొలిటికల్ ఫీవర్ పట్టుకుందని నారాయణ అన్నారు. కేసీఆర్‌కి జ్వరం వచ్చిందంటే నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధం లేరని ఆయన అన్నారు. ఒకవేళ నిజంగానే జ్వరం వస్తే వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసి వుండేవారు కదా అన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి పర్యటనలో ప్రొటోకాల్ పాటించాలన్నారు.