Rs 2,000 Note Withdrawn: బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ పలు విషయాల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని సగటు భారతీయుడు భావిస్తున్న కాలం అది. సరిగ్గా అటువంటి సమయంలోనే నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిచారు. ఆ రోజు అర్థరాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. నల్లధనం అదుపు చేయడంతో పాటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆర్థిక నిధులు అందకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..
ఆ సమయంలో కొత్తగా రూ. 500, రూ.2,000 నోటును తీసుకువచ్చింది కేంద్రప్రభుత్వం. తాజాగా ఈ రోజు రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపుగా ఏడేళ్ల పాటు రూ. 2000 నోటు మనుగడలో ఉంది. ఆర్బీఐ రూ.2,000 నోటును మార్చడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023ను ప్రకటించింది. నోట్ల రద్దు సమయంలో ఒత్తడిని తట్టుకోవడానికి ఆర్బీఐ రూ. 2000 లాంటి ఎక్కువ విలువ ఉన్న నోట్లను తీసుకువచ్చింది.
ఇదిలా ఉంటే కాలానుగుణంగా ఈ ఏడేళ్ల కాలంలో రూ.2000 నోటు క్రమక్రమంగా కనిపించడం తగ్గిపోయింది. ఆర్బీఐ చెబుతున్న లెక్కల ప్రకారం.. రూ.6.37 లక్షల కోట్లుగా ఉన్న రూ. 2000 నోట్ల విలువ 2018 మార్చి 31 నాటికి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గింది. 2023 మార్చి 31 నాటికి 10 శాతానికి చేరింది. దీంతో క్రమంగా నోట్లను వాడకం తగ్గిపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. 2018-19 నుంచే రూ. 2000 నోట్ల ముద్రణను ప్రభుత్వం ఆపేసింది. ప్రస్తుతం రూ.2వేల నోట్లు ఉన్నవారు ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మాత్రమే మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు వెల్లడించింది.