Why Do You Say Jai Sree Ram, Not Jai Siyaram ? Rahul Gandhi To RSS, BJP: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహిళలను అణచివేస్తోందని అన్నారు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’లో ఆర్ఎస్ఎస్, బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రణాళిక అని బుధవారం అన్నారు. భయం, ద్వేషానికి వ్యతిరేకంగా నిలిచేందుకే భారత్ జోడో యాత్ర అని అన్నారు. రాముడు, సీతాదేవిని సూచించే ‘జై సియారామ్’ బదులు ‘జై శ్రీరాం’ అని ఎందుకు అంటున్నారని.. ఇలా పిలవడం ద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సీతాదేవిని అవమానిస్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మండిపడ్డారు.
రాజస్థాన్ దౌసా జిల్లాలోని బగ్డి గ్రామంలో ప్రసంగిస్తూ.. మీకు ఆర్ఎస్ఎస్ లో మహిళలు కనిపించరు..వారు మహిళల్ని అణచివేస్తారు..మహిళల్ని వారి సంస్థల్లోకి అనుమతించరు అని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ లో రాష్ట్ర సేవిక సమితి అనే మహిళా విభాగం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మీరు జై శ్రీరాం అంటారు.. కానీ జై సియారామ్ అని ఎందుకు అనరు..? సీతామాతను ఎందుకు తొలగించారు..? ఆమెను ఎందుకు అవమానించారు..? మీరు భారతదేశంలోని మహిళలను ఎందుకు అవమానిస్తున్నారంటూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను ప్రశ్నించారు.
Read Also: Tamil Nadu: లారీ తాడే ఉరితాడైంది.. కానీ అదృష్టంగా బయటపడ్డ బైకర్
భారతదేశంలో 100 మంది ధనవంతల వద్ద ఉన్న సంపద దేశంలోని 55 కోట్ల ప్రజలకు సంపదకు సమానమని ఆయన అన్నారు. భారతదేశంలో సంపద కేవలం 100 మంది వద్దే ఉందని..వారి కోసమే దేశం నడుస్తోందని విమర్శించారు. దేశంలో నలుగురు, ఐదుగురు వ్యక్తులు మహారాజులుగా వ్యవహరిస్తున్నారని.. మొత్తం ప్రభుత్వం, మీడియా, అందరు బ్యూరో క్రాట్స్ వారి ఇష్టానుసారం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరికమేరకే వారు పనిచేస్తున్నారంటూ దుయ్యబట్టారు.
సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం రాజస్థాన్లో సాగుతోంది. శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. 12 రాష్ట్రాలు,2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగుతున్న ఈ యాత్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్ లో పూర్తవుతుంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది.