Rope from truck wraps biker’s neck in freak road accident in Tamil Nadu: ఆవగింజంత అదృష్టం ఉన్నా చాలు ఎంతటి విపత్తుల నుంచైనా తప్పించుకోవచ్చు. ఎలాంటి ప్రమాదాల్లో అయినా సురక్షితంగా ఉండొచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. తమిళనాడు తూత్తుకుడిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అద్భుతరీతిలో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే తూత్తుకూడిలో ఎదురెదురుగా లారీ, బైకు వస్తున్న క్రమంలో లారీకి వేలాడుతున్న తాడు యువకుడి మెడకు చుట్టుకుంది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. అయితే అదృష్టం కొద్దీ బైకర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
Read Also: Border Dispute: మహారాష్ట్రలో హాలు.. తెలంగాణలో వంటిల్లు.. 14 గ్రామాల విచిత్ర పరిస్థితి
తూత్తుకూడి జిల్లా శ్రీవైకుంఠం పట్టణానికి చెందిన ముత్తు అనే యువకుడు బైక్ పై వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఓ లారీ వస్తోంది. ఏరల్ ప్రాంతం దాటుతుండగా.. అకస్మాత్తుగా లారీకి ఉన్న తాడు ముత్తు మెడకు చుట్టుకుంది. దీంతో ఒక్కసారిగా ముత్తు బైకు పై నుంచి గాలిలోకి ఎగురుతూ రోడ్డుపై పడిపోయాడు. అతని మెడకు తాడు మరింతగా చుట్టుకోకుండా వెంటనే చుట్టుపక్కల ఉన్నవారంతా సహాయం చేశారు. దీంతో స్వల్పగాయాలతో యువకుడు బయటపడ్డాడు. ఏ మాత్రం అటూఇటూ అయినా లారీకి వెళాడుతున్న తాడే.. ముత్తుకు ఉరితాడు అయ్యేది. ఘటన జరిగిన కొంత సమయం వరకు స్పృహ కోల్పాయాడు. ఆ షాక్ నుంచి తేరుకుని తనకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు రెండు నిమిషాలు పట్టింది. లారీ డ్రైవర్ ను పట్టుకుని స్థానికులు కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.