CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తిరంగా మార్చ్ కోసం వెళ్తున్న దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేయడంతో విడుదలయ్యారు.
దాస్, రాంకాల జైలులోనే ఎందుకు..?
ఇదిలా ఉంటే, అభిజిత్ దీప్కే అరెస్ట్ అయిన కొన్ని గంటలకే విడుదలైతే, సీజేపీ కో కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లో ఇంకా జైలులోనే ఉన్నారు. దీనికి కారణం వీరు వేర్వేరు సందర్భాల్లో అరెస్ట్ కావడమే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అభిజిత్ దీప్కే తిరంగా మార్చ్‌కు పిలుపునిచ్చిన సెంట్రల్ పార్క్‌కు చేరుకోకముందే పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
కానీ అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు ఆంక్షలు ఉన్నప్పటికీ దొంగచాటున జంతర్ మంతర్ చేసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో సీజేపీ సభ్యుడు అజింక్య షిండేను కూడా అక్టోబర్ 13న పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, నిబంధనల్ని ఉల్లంఘించడం, అక్టోబర్ 10న జంతర్ మంతర్ నిరసన సమయంలో బాండ్ నిబంధనల్ని ఉల్లంఘించడం కారణంగా వీరికి కోర్టు 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. షిండేకు వ్యక్తిగత బాండ్, పూచీకత్తు సమర్పించే షరతుతో ఆరు నెలల పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని హామీ తీసుకుని విడుదల చేశారు.
ఏ చట్టాల కింద కేసులు నమోదు..?
దీప్కే, దాస్, రాంకాలపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 170 ప్రకారం, గుర్తించదగిన నేరాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు అరెస్టు చేయవచ్చు. సెక్షన్ 126 ప్రకారం, శాంతిభద్రతలను కాపాడేందుకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బాండ్ సమర్పించాలని ఆదేశించవచ్చు. అక్టోబర్ 10న ఢిల్లీలో నిరసన సందర్భంగా ముగ్గురు కూడా శాంతిభద్రలకు విఘాతం కలిగించమని ఏడాది కాలానికి రూ. 50,000 బాండ్‌పై సంతకం చేశారు.

