Sanjay Raut On Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రోజు కోర్టు ముందు రిమాండ్ కోసం ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఏ-1 సిసోడియానే అని సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు రిమాండ్ పై తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం కుంభకోణంలో విచారణ నిమిత్తం మంత్రిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీబీఐ కోరింది. ఇదిలా ఉంటే ఈ కేసులో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంపై ప్రతిపక్షాలు బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Read Also: King Fisher beers : కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదు.. 30కి.మీ పోతున్నాం
ఉద్దవ్ ఠాక్రే వర్గ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఈ అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో లేనప్పుడు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసినా, వారిని హింసించినా ఎవరు సహాయం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్న తీరు చూస్తుంటే.. వారు అధికారంలో లేనప్పుడు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని నేను భయపడుతున్నానని.. వాళ్లను కూడా ఇలాగే వేధిస్తే, అరెస్ట్ చేస్తే వారికి ఎవరు సహాయం చేస్తారు..? అని ట్వీట్ చేశారు. సిసోడియా ఉన్న ఫోటోను కూడా ఆయన షేర్ చేవారు.
నిన్న ఎనిమిది గంటల తర్వాత మనీష్ సిసోడియాను నిన్న రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుపడుతూ.. డర్టీ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈ అరెస్టును తప్పుబట్టారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తుందనే దానికి ఈ అరెస్టే ఉదాహరణ అని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.