Madhavi Latha: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెనను శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ వంతెన దేశాన్ని మొత్తం జమ్మూ కాశ్మీర్‌తో అనుసంధానిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంలో ఒక మహిళా ప్రొఫెసర్ జి మాధవి లత కృషిని అంతా కొనియాడుతున్నారు. 17 ఏళ్లుగా ఆమె తన జీవితాన్ని వంతెన నిర్మాణానికి ధారపోశారు.
ఈ ప్రాజెక్ట్ 272 కి.మీ. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగంలో ఈ వంతెన నిర్మించబడింది. వంతెన నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో మాధవి లత ఒకరు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె, జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా చీనాబ్ వంతెన ప్రాజెక్టులో 17 సంవత్సరాలు పాల్గొన్నారు. వంతెన కాంట్రాక్టర్ అయిన ఆఫ్కాన్స్‌తో మాధవి లత కలిసి పనిచేశారు. భూభాగం పరిస్థితులు, ప్రమాదాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వంతెన నిర్మాణం సక్రమంగా జరిగేలా సహకరించారు. అత్యంత పెలుసుగా ఉండే హిమాలయాల ప్రాంతంలో సవాళ్లతో కూడుకున్న వంతెన నిర్మాణంలో ఆమె పాత్ర చాలా కీలకం.
మాధవి లత ఎవరు..?
మాధవి లత ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 1992లో ఆమె జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్‌లో బి.టెక్ పూర్తి చేశారు. వరంగల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. జియో టెక్నికల్ ఇంజనీరింగ్‌లో స్పెషలైజేషన్ చేశారు. 2000లో ఐఐటీ మద్రాస్ నుంచి జియో టెక్నికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. 2021లో, ఆమెకు ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ ఉత్తమ మహిళా జియోటెక్నికల్ పరిశోధకురాలిగా అవార్డును ప్రదానం చేసింది. 2022లో స్టీమ్ ఆఫ్ ఇండియాలో టాప్ 75 మహిళలలో ఆమె పేరు కూడా ఉంది.
చీనాబ్ వంతెన నిర్మాణంలో కీలక పాత్ర:
చీనాబ్ వంతెన అత్యంత సవాళ్లతో కూడుకున్న నిర్మాణం. ఆ ప్రదేశం స్థలాకృతి, వాతావరణ పరిస్థితులు, మారుమూల ప్రాంతం ఇంజనీరింగ్ బృందానికి కష్టంగా మారాయి. డాక్టర్ లత బృందం అడ్డంకులను అధిగమించి ‘‘డిజైన్-యాజ్-యు-గో విధానం”ని అవలంబించింది. దీని అర్థం ఏంటంటే సర్వే ముందు కనిపించని రాతి లక్షణాలు, పగిలిన రాళ్లు, రాళ్లలో దాగిన రంధ్రాల వంటి వివిధ రాతి లక్షణాల వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రియల్ టైమ్‌లో పనిచేయడం.
నిర్మాణ సమయంలో కనుగొన్న రాతి పరిస్థితులు వాటిపై పనిచేయడానికి లత టీమ్ సంక్లిష్టమైన కాలిక్యులేషన్స్, డిజైన్ మార్పులను నిర్వహించింది. స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రాతి యాంకర్ల రూపకల్పన, ప్లేస్‌మెంట్‌పై ఎప్పటికప్పుడు సలహాలు అందించేవారు. ఆమె ఇటీవల ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్ యొక్క మహిళల ప్రత్యేక సంచికలో “డిజైన్ యాజ్ యు గో: ది కేస్ స్టడీ ఆఫ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జి” అనే శీర్షికతో ఒక పత్రాన్ని ప్రచురించారు.
చీనాబ్ వంతెన గురించి కీలక వివరాలు:
రూ. 1,486 కోట్ల వ్యయంతో నిర్మించబడిన చీనాబ్ వంతెనను ప్రభుత్వం “ఇటీవలి చరిత్రలో భారతదేశంలో ఏ రైల్వే ప్రాజెక్ట్ ఎదుర్కోని అతిపెద్ద సివిల్-ఇంజనీరింగ్ సవాలు”గా అభివర్ణించింది. 359 మీటర్ల వంతెన ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు పొడవుగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కాశ్మీర్ లోయలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.