Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానాన్ని వదిలిపెట్టిన తర్వాత తొలిసారిగా ఆ ప్రాంత ప్రజలకు లేఖ రాశారు. జూన్ 18న కేరళలోని ఈ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఆయన వయనాడ్‌కి రాజీనామా చేసి, రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు మొగ్గు చూపారు.
Read Also: Noida: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డ మహిళ.. రూ.1.3 కోట్లు అపహరణ
జూన్ 17న తాను చేసిన ప్రకటనను చూపుతూ రాహుల్ గాంధీ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ నేను మీడియా ముందు నిలబడి నా నిర్ణయం గురించి చెప్పినప్పుడు మీరు నా కళ్లలో దుఃఖాన్ని చూసి ఉంటారు’’ అని లేఖలో పేర్కొన్నారు. వయనాడ్ ప్రజలు తనకు అనంతమైన ప్రేమ, అప్యాయతను పంచారని, ఐదేళ్ల క్రితం నేను మిమ్మల్ని కలిశానని, ఆ సమయంలో తాను మీకు అపరిచితుడని, అయినా మీరు నన్ను నమ్మి నాకు మద్దతు ఇచ్చారని రాహుల్ గాంధీ అన్నారు. మీరు నాకు ఆశ్రయం, నా ఇల్లు, నా కుటుంబం అని అన్నారు. నేను వేధింపులకు గురైనప్పు మీ ప్రేమ నన్ను రక్షించిందని చెప్పారు.
ప్రస్తుతం వయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీకు ప్రాతినిధ్యం వహించేందుకు తన సోదరి ప్రియాంక ఉందని చెప్పారు. మీరు అవకాశం ఇస్తే ఆమె మీకు ఎంపీగా అద్భుతమైన పని చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.మీరు నా కుటుంబంలో భాగం మరియు మీలో ప్రతి ఒక్కరికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు.