ప్రపంచ వ్యాప్తంగా గోధుమ సంక్షోభం నెలకొంది. దీంతో దేశీయంగా గోధుమలను అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే ఇండియా మే లో గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని విధించింది. అయితే తాజాగా గోధుమ పిండి ఎగుమతిపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరల కారణంగా ప్రపంచ కొరత వల్ల మే నెలలో జాతీయంగా ఆహార ధాన్యాల నిల్వలు పెంచడానికి గోధుమ ధాన్యాల ఎగుమతులు భారీగా తగ్గించబడ్డాయి.
విదేశీ వాణిజ్య నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్( డీజీఎఫ్టీ) ప్రకారం గోధుమ పిండితో పాటు, రవ్వ, మైదా ఎగుమతులపై ఆంక్షలు విధించింది. వీటి ఎగుమతిపై నిషేధం లేకపోయినా.. గోధుమల ఎగుమతి ఇంటర్ మినిస్ట్రీరియల్ కమిటీ సిఫార్సులకు లోబడి ఉంటుందని ప్రకటించింది. గోధుమల ఎగుమతులపై ఇంటర్ మినిస్ట్రీరియల్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం జూలై 12 నుంచి అమలులోకి రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా గోధుమల సరఫరాలో భారీగా అంతరాలు ఏర్పడ్డాయి. దీంతో ధరల హెచ్చుతగ్గులు నమోదు అవుతున్నాయి. మరోవైపు నాణ్యతకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే గోధుమ పిండి నాణ్యత కొనసాగించడం అత్యవసరం
Read Also: Vishal: నిశ్చితార్థం బ్రేక్ అయ్యాకా మరోసారి ప్రేమలో విశాల్.. అమ్మాయి ఎవరంటే..?
రష్యా- ఉక్రెయిన్ దేశాలు ప్రపంచ గోధుమ సరఫరాలో నాలుగింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. గత మే నెలలో ఇండియా గోధుమలపై బ్యాన్ విధించడంతో కొన్ని యూరోపియన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారతదేశం గోధుమ ఉత్పత్తిలో చైనా తరువాత రెండోస్థానంలో ఉంది. ఇండియా గతేడాది 109 మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేసింది. ఇందులో 7 మిలియన్ టన్నులను మాత్రమే ఎగుమతి చేసింది.