WhatsApp India Head, Meta India Public Policy Director Quit: ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. మెటాలో పనిచేస్తున్న 13 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 11,000 ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గడం, ఆర్థిక మాంద్యం భయాలతో మెటా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది.
Read Also: Tiger Scare: పులి అడుగు జాడలు గుర్తించిన అధికారులు.. భయాందోళనలో ప్రజలు
ఇదిలా ఉంటే వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, ఇండియాలో మెటా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ రాజీనామా చేసినట్లు మెటా ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. నాలుగేళ్లుగా అభిజిత్ బోస్ వాట్సాప్ కీలక ఉద్యోగిగా ఉన్నారు. ఇటీవల మెటా పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు తర్వాత ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఇద్దరు కీలక ఉద్యోగుల రాజీనామాకు ప్రస్తుత తొలగింపులతో సంబంధం లేదని మెటా ప్రతినిధి వెల్లడించారు. భారతదేశంలో పబ్లిక్ పాలసీకి కొత్త డైరెక్టర్ గా శివనాథ్ తుక్రాల్ ను కంపెనీ నియమించింది. త్వరలోనే అభిజిత్ బోస్ స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
ఇటీవల కాలంలో పలు టెక్ దిగ్గజాలు తమ వర్క్ ఫోర్స్ తగ్గించుకుంటున్నాయి. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ తమ సగం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ కూడా ఉద్యోగుల కోతల ప్రారంభించాయి. ఇదే దారిలో ఇప్పుడు మెటా నిర్ణయం తీసుకుంది. ఇదే దారిలో స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ, అమెజాన్ వంటి కంపెనీలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.