High Court: వివాహ సమయంలో వధువుకు బహుమతిగా వచ్చే బంగారు ఆభణాలు, నగదు ఆమెకు సంబంధించిన ఆస్తి అని లేదా దానిని ‘స్త్రీ ధనం’’గా పరిగణించాలని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి ఆస్తిపై మహిళకు ప్రత్యేక హక్కులు ఉంటాయని చెప్పింది. ఎర్నాకుట కలమస్సేరికి చెందిన ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని న్యాయమూర్తులు దేవన్ రామచంద్రన్, ఎంబి స్నేహలతతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి , ఈ తీర్పుని చెప్పింది. విడాకుల తర్వాత పెళ్లి సమయంలో ఆమెకు వచ్చిన బహుమతులు, ఆభరణాలను తిరిగి ఇవ్వాలను ఆమె వాదనను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీనిని సదరు మహిళ హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా ..‘‘దురదృష్టవశాత్తూ భర్త లేదా అత్తమామలు అలాంటి విలువైన ఆస్తులను దుర్వినియోగం చేసిన కేసులు చాలా ఉన్నాయి’’ అని కోర్టు పేర్కొంది. 2010లో వివాహ సమయంలో ఆమె కుటుంబం ఆమెకు 63 సవర్ల బంగారం, రెండు సవర్ల గొలుసు ఇచ్చిందని, బంధువులు బహుమతిగా 6 సవర్ల బంగారాన్ని కూడా ఇచ్చినట్లు పిటిషన్ చెప్పింది. అయితే, మంగళసూత్రం, ఒక గాజు, రెండు ఉంగరాలు తప్పా అన్ని ఆభరనణాలను భద్రపరుస్తామని అత్తింటి వారు తీసుకెళ్లారని ఆమె ఆరోపించింది. తన భర్త అదనంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేయడంతో వివాహ సంబంధం చెడిపోయింది.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కన్నా ముందు 3 ప్రాంతాల్లో ఉగ్రవాదుల రెక్కీ..
మహిళ తల్లిదండ్రులు ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బుతో బంగారం కొనుగోలు చేసినట్లు చూపించే పత్రాలను మహిళ సమర్పించింది. దీంతో తన వాదనను నిరూపించుకుంది. కేసును సమీక్షించిన తర్వాత 59.5 సవర్ల బంగారాన్ని లేదా దాని ప్రస్తుత మార్కెట్ విలును ఆమె భర్త ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే, బంధువులు పెట్టినట్లు చెప్పిన సవర్ల బంగారానికి సంబంధించిన రుజువల్ని మహిళ సమర్పించలేకపోయింది.
ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ సంయంలో వధువుకు ఇచ్చే బంగారాన్ని తరుచుగా భర్త లేదా అతడి కుటుంబం సురక్షితంగా ఉంచుతామనే ముసుగులో వాటిని తమ దగ్గరే ఉంచుకుంటారని కోర్టు పేర్కొంది. చాలా సందర్భాల్లో, ఇలా ఇచ్చేటప్పుడు వారు స్త్రీకి రాతపూర్వక రికార్డు లేదా రసీదుగానీ ఇవ్వరు. దీంతో సదరు మహిళ ఇచ్చిన ఆభరణాలు నావే అని నిరూపించుకోవడం కష్టంగా మారుతోంది. గృహహింస, వరకట్న వేధింపులు లేదా విడాకుల వంటి కేసుల్లో మహిళ తన ఆభరణాలను దుర్వినియోగం చేశారని లేదా తిరిగి ఇవ్వలేదని చెప్పడం సమస్యాత్మకంగా మారుతోందని కోర్టు చెప్పింది. ఇలాంటి కేసుల్లో క్రిమినల్ కేసుల లాగా కఠినమైన చట్టపరమైన రుజువు కోసం పట్టుబట్టలేము అని కోర్టు పేర్కొంది.