Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులను పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ దాడికి రెండు రోజుల ముందు ఉగ్రవాదులు బైసరన్ లోయలో రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడితో సంబంధం ఉన్న, ఉగ్రవాదులకు సహకరించిన ఒవర్ గ్రౌండ్ వర్కర్లలో (OGW) ఒకరిని విచారిస్తున్నప్పుడు ఈ విషయం వెల్లడైంది.
ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదులు ఏప్రిల్ 15న పహల్గామ్ చేరుకున్నారు. బైసరన్ లోయతో పాటు కనీసం 4 ప్రదేశాల్లో నిఘా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల లక్ష్యాల్లో అరు లోయ, బేతాబ్ వ్యాలీ, స్థానికంగా ఉన్న ఉద్యానవనం ఉన్నాయి. అయితే, ఈ ప్రాంతాల్లో భద్రత బలంగా ఉండటంతో దాడులు చేయలేదని తెలిసింది. జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) విదేశీ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినట్లు భావిస్తున్న సుమారు 20 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లను గుర్తించింది. వీరిలో చాలా మందిని అరెస్ట్ చేశారు. మరికొందరిపై నిఘా ఉంచారు.
Read Also: CM Revanth Reddy: కేసీఆర్ చేసిన అప్పులు కట్టడానికే లక్షా 2 వేల కోట్లు అప్పు తెచ్చినా..
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, కనీసం నలుగురు OGWలు ఉగ్రవాదులకు నిఘా, లాజిస్టికల్ మద్దతుతో సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దాడికి ముందు దశలో ఈ ప్రాంతంలో 3 శాటిలైట్ ఫోన్లను ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. దాడికి సంబంధించి NIA , నిఘా సంస్థలు ఇప్పటివరకు 2,500 మందికి పైగా వ్యక్తులను విచారించాయి. ప్రస్తుతానికి, 186 మందిని విస్తృతంగా ప్రశ్నించడానికి కస్టడీలో ఉంచారు.
పహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌ని భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. కుప్వారా, హంద్వారా, అనంత్‌నాగ్, ట్రాల్, పుల్వామా, సోపోర్, బారాముల్లా మరియు బండిపోరా వంటి ప్రాంతాల్లో ఉగ్రవాద మద్దతుదారులు, ఉగ్ర సంస్థల సభ్యుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాద సంస్థలతో అనుబంధంగా ఉన్న వ్యక్తుల కాల్ రికార్డుల్ని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్ర సంస్థల సభ్యులు, పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ల మధ్య కమ్యూనికేషన్ సంబంధాలను అధికారులు గుర్తించారు.