Supreme Court: ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేమని సుప్రీం పేర్కొంది. వీవీ ప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించని పేపర్ స్లిప్‌లతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లో పోలైన ఓట్లను క్షుణ్ణంగా క్రాస్ చెక్ చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కేవలం అనుమానంతో వ్యవహరించలేమని జస్టిన్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Read Also: V. Hanumantha Rao: ప్రధాని దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన ఆందోళనలపై కోర్టు స్పందించింది. ఈవీఎంలపై ఆరోపణలు రావడంతో, ఈవీఎంలో నమోదైన ప్రతీ ఓటును వీవీప్యాట్ పేపర్ స్లిప్‌లతో క్రాస్ వెరిఫై చేయాలని పిటిషన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో రాండమ్‌గా ఎంపిక చేసిన 5 ఈవీఎంలకు ఈ క్రాస్ వెరిఫికేషన్ జరుగుతోంది. గత విచారణలో పిటిషనర్లు ప్రజల విశ్వాస సమస్యగా దీన్ని లేవనెత్తారు. బ్యాలెట్ ఓటింగ్ వ్యవస్థకు తిరిగి వెళ్లిన యూరోపియన్ యూనియన్ దేశాల ప్రస్తావణ తీసుకువచ్చారు. అయితే, ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని గమనించిన కోర్టు వాటిని కొట్టి వేసింది. ఎన్నికల సంఘం, ప్రస్తుత వ్యవస్థ ఫూల్‌ప్రూఫ్ అని నొక్కి చెప్పింది.
ఈవీఎంలో రెండు యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్ మరొకటి బ్యాలెట్ యూనిట్. ఇవి కేబుల్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ రెండు మిషన్లు వీవీపాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) కనెక్ట్ చేయబడి ఉంటుంది. మనం వేసిన ఓటు వేయగానే ఎవరికి ఓటు వెళ్లిందనే విషయం వీవీప్యాట్ స్లిప్ ద్వారా మనకు తెలుస్తుంది. దీంతో ఓటర్‌కి నమ్మకం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ వీవీ ప్యాట్ ద్వారా వచ్చే పేపర్ స్లిప్‌లతో బ్యాలెట్‌లో నమోదైన ఓట్లు మొత్తాన్ని క్రాస్ చెక్ చేయాలని కొంతమంది కోరుతున్నారు.