బెంగళూరు ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2 దగ్గర వాటర్ పైపు పగిలిపోయింది. దీంతో విమానాశ్రయంలో ఉన్న కార్యాలయాల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ఆఫీసులన్నీ నీటితో జలమయం అయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనతో విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని బీఐఏఎల్ అధికారులు తెలిపారు. ఆయా ఎయిర్‌లైన్స్ కార్యాలయాల్లోకి మాత్రం నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. బెంగళూరు విమానాశ్రయంలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లోని స్వంకీ టెర్మినల్ 2లో జనవరి 1న పైప్ పేలడంతో నీరు లీకేజ్ అయిందని చెప్పారు. ఎయిర్‌లైన్ కార్యాలయాలు ఉన్న మొదటి అంతస్తులో నీరు చేరిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Switzerland: స్విట్జర్లాండ్‌లో బుర్ఖా నిషేధం.. చట్టాన్ని అతిక్రమిస్తే ఫైన్ ఎంతంటే..!
నీరు లీకేజీ కావడంతో విమానాశ్రయం, ఎయిర్‌లైన్ సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి 7:30 గంటల నుంచి సీలింగ్‌లోంచి నీరు కారుతూనే ఉంది. దీంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సౌదీ, జపాన్ ఎయిర్‌లైన్స్ సంస్థల కార్యాలయాలు జలమయం అయ్యాయి. సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఎయిర్‌లైన్ ఆపరేటర్ల బ్యాగేజ్ ట్యాగ్‌లు, రోల్స్, బోర్డింగ్ పాస్‌లు వంటి వస్తువులు నీటిలో నానిపోయాయి. సమస్యను గుర్తించి మరమ్మత్తులు చేపట్టారు.
టెర్మినల్-2 రూ.5,000 కోట్లతో నిర్మించారు. 2022, నవంబర్ 11న ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. దీనిని ‘టెర్మినల్ ఇన్ ఎ గార్డెన్’గా నామకరణం చేశారు. ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాలలో ఒకటిగా గుర్తించబడింది. దేశీయ కార్యకలాపాలు జనవరి 15, 2023న ప్రారంభం కాగా… అంతర్జాతీయ కార్యకలాపాలు సెప్టెంబరు 12, 2023న ప్రారంభమయ్యాయి. అయితే టెర్మినల్‌లో మే 2023లోనే మొదటి నీటి లీకేజీని ఎదుర్కొంది. మే 9, 2024న భారీ వర్షాల కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్గర నీటి లీకేజీ ఏర్పడింది. అప్పటి నుంచి టెర్మినల్ ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma : ఐదో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ ఔట్?