PM Modi: బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ఎత్తేయడం తర్వాత నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్, భారత్ లో వాణిజ్య సంబంధాలను కూడా కట్ చేసుకుంది. అయితే దీని ఫలితాలను పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత్-పాకిస్తాన్ సంబంధాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ తో భారత్ సాధారణ సంబంధాలనే కోరుకుంటోందని అయితే ఇది ఉగ్రవాదం లేని వాతావరణం సృష్టించినప్పుడే సాధ్యం అని ఆయన అన్నారు. నిక్కీ ఆసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఉగ్రవాదం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్ పై ఉందని ప్రధాని మోడీ అన్నారు.
సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పదేపదే పాకిస్తాన్ ను హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అలజడులు రేపేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పలు వేదికలపై పాక్ తీరును భారత్ ఎండగట్టింది. అయితే పాకిస్తాన్ ఎప్పటిలాగే జమ్మూ కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన, భారత్ లో మైనారిటీలను అణిచివేస్తున్నారంటూ పాత పాటే పాడుతోంది. ఇటీవల గోవాలో జరిగిన ఎస్ సీ ఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. భారత్ విదేశంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇతర సభ్య దేశాల మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాాలు నిర్వహించినప్పటికీ.. పాక్ మంత్రి భేటీ కాలేదు.
Read Also: Anand Mahindra: కారు కొన్న ఆనందంలో కుటుంబం డ్యాన్స్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..?
ఆసియాలో అతిపెద్ద స్వతంత్ర మీడియా గ్రూపుల్లో నిక్కీ ఆసియా ఒకటి. జీ 7 సమావేశానికి ప్రధాని మోడీ జపాన్ వెళ్లారు. చైనాతో సంబంధాల విషయంలో మాట్లాడుతూ.. భారతదేశం తన సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని, దానికి కట్టుబడి ఉన్నామని మోడీ అన్నారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతత చాలా అవసరం. భారతదేశం-చైనా సంబంధాల యొక్క భవిష్యత్తు అభివృద్ధి పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం మరియు పరస్పర ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది” అని ప్రధాని మోదీ అన్నారు. భారత్, చైనా సంబంధాలు ప్రపంచ దేశాలకు అవసరం అని మోడీ వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదంలో భారతదేశం మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని అడిగిన ప్రశ్నకు, ఉక్రెయిన్ వివాదంపై తమ దేశం యొక్క వైఖరి ‘‘స్పష్టంమైదని, తిరుగులేనిది’’ అని పిఎం మోడీ అన్నారు. భారత్ శాంతి వైపు నిలుస్తుందని అన్నారు. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మేము రష్యా, ఉక్రెయిన్ తో సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు. సహకారం పెంచుకోవాలని కానీ ఘర్షణ కాదని ఆయన అన్నారు.