Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్, సినీ నటుడు విజయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఆయన చివరి సినిమాగా చెప్పబడుతున్న ‘‘జన నాయగన్’’ విడుదల కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ పరిణామాల తర్వాత తొలిసారిగా విజయ్ తన పార్టీ టీవీకే సమావేశానికి హాజరయ్యారు. 3000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యకర్తలతో మామల్లపురంలో జరిగిన వ్యూహాత్మక సమావేశంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తాను ‘‘ఒత్తిడికి లొంగిపోవనని’’, ‘‘తలవంచనని’’ అన్నారు.
మరికొన్ని రోజుల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో ఈ సమావేశం నుంచి పదునైన విమర్శలు చేశారు. ఇది కేవలం ఎన్నికలు మాత్రమే కాదని, ప్రజాస్వామ్య యుద్ధమని అన్నారు. ఈ యుద్ధంలో పోరాడే నా కమాండోలు కార్యకర్తలే అని చెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రతీ ఓటును రక్షంచాలని, ప్రతీ ఒక్కరిని కలవాలని కార్యకర్తల్ని ఉత్తేజపరిచారు. దుష్ట శక్తి’ (డీఎంకే) మరియు ‘అవినీతి శక్తి’ (ఏఐఏడీఎంకే)లను ఎదుర్కొనే ధైర్యం కేవలం టీవీకేకు మాత్రమే ఉందని విజయ్ అన్నారు.
Read Also: T20 World Cup: దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్.. ఐసీసీ వార్నింగ్‌లో జట్టు ప్రకటన..
రాష్ట్రవ్యాప్తం ప్రచారాన్ని సోమవారం నుంచి ప్రారంభించబోతున్నట్లు టీవీకే నాయకులు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ రూపొందించారు. అయితే, పొత్తులపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు(ఆదివారం) జరిగిన కార్యక్రమంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తాము ఏ స్నేహితుడు లేకుండా ఒంటరిగానే గెలుస్తాము’’ అని అన్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్‌లో, తమిళనాడులోని కరూర్‌లో విజయ్ ప్రసంగించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ విషయమై ప్రస్తుతం సీబీఐ అతడిపై దర్యాప్తు చేస్తోంది, ఢిల్లీలో అతడిని రెండుసార్లు విచారించింది. విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలను సెన్సార్ బోర్డు నిలిపివేయడంతో అది వార్తల్లో నిలిచింది. సినిమా వివాదం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉంది.