Vande Bharat Express Train Repaired Within 24 Hours: దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది. ముంబై-గాంధీ నగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో అహ్మదాబాద్ కు సమీపంలో ఉదయం 11.15 గంటలకు గేదెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైన్ ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ కోచ్ కు ముక్కు భాగంలో ఉండే మౌంటు బ్రాకెట్ కవర్ దెబ్బతింది. రైలుకు సంబంధించి ఇతర భాగాలేమి దెబ్బతినలేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలు చిన్న ప్రమాదానికే దెబ్బతిందంటూ.. ఓ సెక్షన్ ప్రజలు విపరీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించారు. ట్రోలర్స్ పండగ చేసుకున్నారు. అయితే దెబ్బతిన్న భాగాన్ని కేవలం 24 గంటల్లోనే అమర్చారు రైల్వే అధికారులు. దెబ్బతిన్న నోస్ భాగాన్ని ముంబై సెంట్రల్ లోని కోచ్ కేర్ సెంటర్ లో రిపేర్ చేశారు. మళ్లీ యథావిధిగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రెడీ అయిందని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ అన్నారు.
Read Also: Viral Video: ఈ పోలీస్ రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి ఇద్దరిని కాపాడాడు
గురువారం అహ్మదాబాద్ కు సమీపంలోని వత్వా, మణినగర్ రైల్వేస్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం జరిగింది. ముందుభాగం లేకుండానే గాంధీ నగర్, ముంబై సెంట్రల్ మధ్య ట్రైన్ ప్రయాణించింది. ట్రైన్ ముందు భాగం ప్రమాదాలను తట్టుకుని, ట్రైన్ పనిచేసే విభాగాలను దెబ్బతియకుండా ఉంటుంది. అందుకే ప్రమాదం సమయాల్లో ట్రైన్ ముందు భాగం దెబ్బతినడం కామన్ గా జరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అదనపు సమయం లేకుండా రైలు దెబ్బతిన్న భాగాన్ని సరిచేశామని సుమిత్ ఠాకూర్ వెల్లడించారు.
స్వదేశీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. సెమీ హైస్పీడ్ వేగంతో వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేశారు. వందేభారత్ సిరీస్ లో భాగంగా సెప్టెంబర్ 30న గాంధీ నగర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. తరువాతి రోజు నుంచే గాంధీ నగర్ – ముంబై మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు తీస్తోంది.