UtterPradesh Fire Accident : ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో సోమవారం రాత్రి ఒక షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు. సిప్రీ బజార్ ప్రాంతంలోని మూడంతస్తుల రెండు ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్స్ షోరూమ్, ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం, మూతపడిన కోచింగ్ సెంటర్, స్పోర్ట్స్ షాప్స్ దగ్ధమయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో బీమా కంపెనీకి చెందిన మహిళా అధికారి సహా నలుగురు మృతి చెందగా,.. ఆరుగురికి పైగా గాయపడ్డారు. మరో ఏడుగురు ఆచూకీ కనిపించడం లేదు. మంటలు చుట్టుముట్టిన ఐదుగురు రెండో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కిందకి దూకిన వారు స్వల్పంగా గాయపడ్డారు. షోరూం బయట, బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన 100కు పైగా ద్విచక్ర వాహనాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో రూ.35 నుంచి 40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
Read also: Vegetable Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. వెలవెలబోతున్న మార్కెట్లు!
సిప్రీ బజార్‌లోని రామ బుక్ డిపో కూడలి సమీపంలో మిషన్ కాంపౌండ్‌కు చెందిన నితేష్, రితేష్ అగర్వాల్‌కు వీఆర్ ట్రేడర్స్ పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ ఉంది. షోరూమ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు ఎగసి పడ్డాయి. ఏసీ, టీవీ, ఫ్రిజ్, మొబైల్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కాలిపోయాయి. మంటలు రెండో అంతస్తుకు చేరాయి. ఎలక్ట్రానిక్ పరికరాల షోరూం మొత్తం మంటల్లో దగ్ధమైంది. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. షోరూమ్‌లో మంటలు చుట్టుముట్టిన ఐదుగురు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి దూకారు. కొద్దిసేపటికే, సమీపంలోని వాల్యూ ప్లస్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇది ఎలక్ట్రానిక్ కూడా పరికరాల షోరూమ్. ఈ షోరూంలో ఉంచిన వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. మూడో అంతస్తులో ఉన్న యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయంలో మంటలు వ్యాపించాయి. ఈ కార్యాలయం కూడా మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అసిస్టెంట్ మేనేజర్ కెకె పూరి నివాసి రాగ్ని రాజ్‌పుత్‌తో సహా నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
Read also: Pakistan: పాకిస్థాన్ లో పరువు హత్యలు.. ఇద్దరి కూతుళ్లను చంపేసిన తండ్రి
మంటలు పక్కనే ఉన్న లైవ్ స్పోర్ట్స్ దుకాణాన్ని కూడా చుట్టుముట్టాయి. రెండో అంతస్తులో మూసి ఉన్న కోచింగ్ సెంటర్‌లో కూడా మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు ఝాన్సీ, లలిత్‌పూర్ జిల్లాలతో పాటు దాతియా, జలౌన్ జిల్లాల నుంచి 80 అగ్నిమాపక దళ వాహనాలను రప్పించారు. సైన్యాన్ని కూడా పిలిచారు. సైన్యం ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. కాలిపోయిన వ్యక్తి మృతదేహం కూడా లభ్యమైంది. అతడిని గుర్తించలేకపోయారు. ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయంలో పనిచేస్తున్న రాగ్ని రాజ్‌పుత్‌తో సహా నలుగురు సజీవదహనమయ్యారని ఎస్‌పి రాజేష్ ఎస్ తెలిపారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు.