Ankita Bhandari Case: ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ రిసార్టులో అంకితా బండారీ అనే 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ హత్య ప్రకంపనలు రేపుతోంది. రిసార్టు యజమానే మరో ఇద్దరితో కలిసి రిసెప్షనిస్టును హత్య చేసినట్లు తేలింది. రిసార్టు యజమాని రాష్ట్ర బీజేపీ నేత కొడుకు కావడంతో ఈ ఘటన దేశమంతటా సంచలనంగా మారింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉత్తరాఖండ్‌లోని బీజేపీ సర్కారు నిందితుడిని అరెస్టు చేయించి, శుక్రవారం రాత్రి రిసార్టును ధ్వంసం చేయించింది. యువతి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రిసార్టులను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు బీజేపీ కూడా స్పందించింది. పుల్కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను, వీరి తండ్రి వినోద్ ఆర్యను పార్టీ నుంచి శనివారం సస్పెండ్ చేసింది. అంకిత్ ఆర్య ఉత్తరాఖండ్ ఇతర వెనుకబడిన తరగతుల కమిషన్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ పదవి నుంచి తక్షణమే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలిచ్చింది. ఇదిలావుండగా, పుల్కిత్ ఆర్యకు చెందిన వనతార రిసార్టుకు స్థానికులు నిప్పు పెట్టారు. దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్మింది. బీజేపీ ఎమ్మెల్యే రేణు బిస్త్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి, ఆమె కారును ధ్వంసం చేశారు. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా తీసుకెళ్లారు. పుల్కిత్ ఆర్యతోపాటు మిగిలిన ఇద్దరు నిందితులను శుక్రవారం పోలీసులు తీసుకెళ్తున్నపుడు కూడా నిరసనకారులు ఆగ్రహంతో రాళ్లు రువ్వారు.
PFI: భారత్‌ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర.. ఎన్ఐఏ రిపోర్టులో సంచలన విషయాలు
రిషికేశ్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని ఈ రిసార్టు ఉత్తరాఖండ్ సీనియర్ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందినది. ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య నిర్వహిస్తున్న రిసార్టులో పనిచేస్తున్న అంకితా బండారీ అనే యువతి ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. శుక్రవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెను హత్య చేసిననట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ హత్య కేసులో పుల్కిత్ ఆర్యతో పాటు ఇద్దరిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 19 ఏళ్ల అంకితా బండారీ పుల్కిత్ ఆర్య రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. ఓ వివాదంతో ఆమెను కాలువలోకి తోసేసినట్లు.. ఆమె మునిగిపోయి చనిపోయినట్లు నిందితులు అంగీకరించినట్లు డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.