PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని అత్యంత నేరారోపణలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది.
రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపుల్లోకి యువత వెళ్లేలా ప్రోత్సహిస్తోంది ఫీఎఫ్ఐ, లష్కరేతోయిబా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సహా పలు ఉగ్రవాద గ్రూపుల్లో ముస్లిం యువత చేరేలా ప్రోత్సహించినట్లు ఎన్ఐఏ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జీహాద్ లోభాగంగా భారతదేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించడానికి పీఎఫ్ఐ కుట్ర పన్నిందని పేర్కొంది. పీఎఫ్ఐ ప్రభుత్వ విధానాలపై ముస్లిం వర్గాల్లో తప్పుడుగా చెబుతూ.. భారత్ లో అసహనాన్ని వ్యాపిస్తుందని పేర్కొంది.
Read Also: Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి
ఇతర మతాలు, వర్గాలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సెప్టెంబర్మ 22న దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది. దాడులు చేసిన సమయంలో ఒక వర్గానికి చెందని ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. పీఎఫ్ఐ సమాజంలో దౌర్జన్యాలు సృష్టించడానికి కుట్ర పన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. నిందితుల నుంచి, పీఎఫ్ఐ కార్యాలయాల నుంచి జప్తు చేసిన ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి సమాచారం రాబట్టేందుకు త్రివేండ్రంలోని సీడీఏసీలో విశ్లేషించాల్సి ఉందని ఎన్ఐఏ పేర్కొంది.
ప్రస్తుతం అరెస్ట్ చేసిన వ్యక్తులపై ఐపీసీ సెక్షన్లతో పాటు యూఏపీఏ చట్టం కింద అనేక కేసులు నమోదు చేసింది ఎన్ఐఏ. అత్యధికంగా కేరళ నుంచి ఎక్కువ అరెస్టులు జరిగాయి. కేరళలో 22 మందిని, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 మందిని, తమిళనాడులో పది మందిని, అస్సాంలో 9 మందిని, ఉత్తర్ ప్రదేశ్ లో 8 మందిని, ఏపీ నుంచి ఐదుగురిని, మధ్యప్రదేశ్ నుంచి నలుగురిని, పుదుచ్చేరి, ఢిల్లీల నుంచి ముగ్గురు చొప్పున, రాజస్థాన్ నుంచి ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.