Site icon NTV Telugu

US-India: భారత్‌కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఇరాన్ ‘‘చాబహార్’’ పోర్టుపై కీలక నిర్ణయం..

Chabahar Port

Chabahar Port

US-India: ఇరాన్ వ్యూహాత్మక ఓడరేపు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్‌ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం ఇండియాను ఇబ్బంది పెట్టేదిగా ఉంది. సెప్టెంబర్ 29, 2025 నుంచి అమలులోకి వచ్చే ఈ నిర్ణయం ఇరాన్‌పై అమెరికా మరింత ఒత్తిడిని పెంచేదిగా ఉంది.

గతంలో ఇరాన్ స్వేచ్ఛ మరియు ప్రతి-వ్యాప్తి నిరోధక చట్టం (IFCA) కింద జారీ చేయబడిన ఈ మినహాయింపుల ద్వారా, భారత్‌తో పాటు ఇతర దేశాలు అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకునేలా, ఓడరేవులో పనిచేయడానికి అనుమతించింది. పాకిస్తాన్‌లో చైనా అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ పోర్టుకు, ఇరాన్ చాబహార్ పోర్టును భారత్ కౌంటర్‌గా భావిస్తోంది. పాకిస్తాన్‌తో ప్రమేయం లేకుండా భారత్ నేరుగా మధ్య ఆసియాతో వాణిజ్య సంబంధాలను విస్తరించుకోవడానికి చాబహార్ కీలకంగా ఉంది.

సెప్టెంబర్ 16న ఒక ప్రకటనలో, యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఈ నిర్ణయం “ఇరాన్ పాలనను ఒంటరిగా చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ యొక్క గరిష్ట ఒత్తిడి విధానానికి అనుగుణంగా ఉంది” అని పేర్కొంది. “రద్దు అమలులోకి వచ్చిన తర్వాత, చాబహార్ ఓడరేవును నిర్వహించే లేదా IFCAలో వివరించిన ఇతర కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులు IFCA కింద ఆంక్షలకు గురవుతారు” అని జోడించింది.

Read Also: Rahul Gandhi: ‘‘Gen Z’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్.. భారత్ నేపాల్‌లా కావాలని అనుకుంటున్నారా..?

భారత్‌కి ఎదురుదెబ్బ..

మినహాయింపులు ఎత్తేయడం భారత్‌కి దెబ్బగా మారొచ్చు. మే 13, 2024న భారత్ తన మొదటి దీర్ఘకాలిక విదేశీ ఓడరేవు ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఇరాన్ పోర్టు, మారిటైమ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో చాబహార్ నిర్వహించడానికి 10 ఏళ్ల ఒప్పందం. ఒప్పందం ప్రకారం, ఇండియన్ పోర్ట్స్ గ్లోబర్ లిమిటెడ్ (IPGL) ఓడరేవు చుట్టూ మౌలిక సదుపాయాల కోసం మరో $250 మిలియన్ల క్రెడిట్‌ సేకరణ ప్రణాళికలతో పాటు, సుమారు $120 మిలియన్లకు హామీ ఇచ్చింది. ఈ ఓడరేవు ద్వారా భారత్ ఆఫ్ఘనిస్తాన్‌కు గోధుమలను పంపిస్తుంది.

2018లో అప్పటి ట్రంప్ సర్కార్ చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై విధించిన ఆంక్షల పరిధి నుంచి భారత్‌ను తప్పించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన్యతను గుర్తించి, చాబహార్ పోర్టు, దాని అనుబంధ రైల్వే లైన్ అభివృద్ధికి సంబంధించి మినహాయింపులు వర్తింప చేసింది. ఇప్పుడు, అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు చేయడంతో, భారత్ ఇప్పుడు తన పెట్టుబడిని, ప్రాజెక్టులో పాల్గొన్న కంపెనీలను రక్షించుకోవడం సవాలుగా మారింది.

Exit mobile version