PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో పాల్గొనడంతో పాటు అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు. అయితే మోడీ పర్యటనపై దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా తెగ ఉలికిపడుతున్నాయి. ఇరుదేశాల మధ్య బలపడుతున్న బంధం తమకు ఎక్కడ నష్టాన్ని కలిగిస్తుందో అని తెగ భయపడుతున్నాయి.
Read Also: Budget Cars in India 2023: 5 లక్షల కంటే తక్కువ ధర.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే మూడు కార్లు ఇవే!
ఈ నేపథ్యంలో చైనా మీడియా భారత్ ను ఉద్దేశించి పలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. చైనా మౌత్ పీస్ పత్రికలు భారతదేశానికి హితబోధ చేయాలని ప్రయత్నిస్తున్నాయి. భారత్ ను ఉపయోగించుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని, చైనాను కట్టడి చేసే ఆటలో పడొద్దని భారత్ ను ఉద్దేశించి సూచించింది. భారత్ పావుగా ఉపయోగించుకుని చైనా ఆర్థిక పురోగతిని అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు గుప్పించింది. చైనా అధికార పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ లో చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీ, మూడు దేశాల మధ్య సంబంధాల గురించి మాట్లాడారు. బీజింగ్ కు వ్యతిరేకంగా అమెరికా, భారత్ ను ఉపయోగించుకోవాలని కోరుకుంటోందని చెప్పారు. అమెరికాతో భారత్ వాణిజ్యం, చైనా వాణిజ్యంతో భర్తీ చేయలేదని ఆయన అన్నారు.
ప్రధాని మోడీ చారిత్రత్మక పర్యటనకు వెళ్తున్నారు. రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారత్-అమెరికాల మధ్య బంధం బలోపేతం అయ్యేలా ఈ పర్యటన ఉండబోతోందని ఇరు దేశాల నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు అమెరికా చట్టసభల సభ్యులు మోడీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చైనాను అడ్డుకోవాలంటే భారత్ మాత్రమే మార్గం అని అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా భావిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా-జపాన్-ఇండియా-అమెరికా దేశాల కూటమి ‘క్వాడ్’ చైనాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాల మధ్య ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లడాన్ని చైనా ప్రత్యేకంగా చూస్తోంది.