Heat Wave: జూన్ నెల చివరికి వచ్చినా కూడా చాలా రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించలేదు. బిపార్జాయ్ తుఫాన్ కారణంగా రుతుపవనాల విస్తరణ నెమ్మదించింది. ఇదిలా ఉంటే చాలా రాష్ట్రాల్లో వడగాలలు తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటీవల బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాలుల తీవ్రతతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఏకంగా 100 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సన్నద్ధతను సమీక్షించేందు ఈ రోజు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతోంది.
Read Also: Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…
ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో అత్యంత తీవ్రతతో వడగాలులు ఉంటాయని ఇప్పటికే వాతావరణ సంస్థ అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాతో సహా అనేక రాష్ట్రాల నుండి హీట్ స్ట్రోక్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య 54 మంది మరణించారు. దాదాపుగా 400 మంది ఆస్పత్తుల్లో చేరారు. అకాస్మత్తుగా మరణాలు పెరగడం, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, ఇతరత్రా కారణాల్లో ఆస్పత్తుల్లో చేరడం ఎక్కువైంది. పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులు పొడగించారు. ప్రస్తుతం ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ(IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తా ఆంధ్రా, తెలంగాణల్లో కూడా హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది.