Congress: వరసగా ఓటములు కాంగ్రెస్ పార్టీలో నిరాశను పెంచుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకున్న తర్వాత జోష్ మీద ఉన్న హస్తం పార్టీకి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్‌కి గురిచేశాయి. మహారాష్ట్రలో అయితే, అత్యంత దారుణమైన రీతిలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏకంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేసింది. వీటిపై సమగ్ర విచారణ జరగాలని ఈసీని కోరింది. ఈసీకి సమర్పించిన పిటిషన్ లో ‘‘ ఓటర్ రికార్డుల్ని ఏకపక్షంగా చేర్చడం/తొలగించడం’’ కారణంగా జూలై 2024-నవంబర్ 2024 మధ్య కాలంలో 47 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని కాంగ్రెస్ పేర్కొంది. సగటున 50,000 మంది ఓటర్లు పెరిగిన 50 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 47 స్థానాల్లో గెలుపొందినట్లు చెప్పింది.
Read Also: India On Bangladesh: ‘‘ఉగ్రవాద మాటలు పెరుగుతున్నాయి.’’ బంగ్లాదేశ్‌పై భారత్ కీలక వ్యాఖ్యలు..
తుల్జాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అక్రమ ఓట్లు వేయడానికి నకిలీ ఆధార్ కార్డులు, వేర్వేరు ఫోటోలు, పేర్లతో వ్యక్తల్ని సృష్టించారిన ఆరోపించింది. తుల్జాపూర్ నియోజకవర్గంలో 1999-2014 వరకు కాంగ్రెస్‌కి చెందిన మధుకరర్ రావు చవాన్ గెలుపొందుతూ వస్తున్నాడు. ఈ సారి అక్కడ నుంచి బీజేపీకి చెందిన రణజగ్జిత్ సిన్హా పాటిల్ 37,000 ఓట్లతో గెలిచారు. బీజేపీ ఈ స్థానంలో గెలవడం ఇదే తొలిసారి.
ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలను కూడా కాంగ్రెస్ హైలెట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈసీ సగటు ఓటింగ్ శాతం 58.22 శాతంగా ఉంది. రాత్రి 11.30 వరకు 65.02శాతానికి పెరిగింది. చివరకు 66.05 శాతంగా నమోదంది. పోలింగ్ ముగిసిన గంటలో 70 లక్షలకు పైగా ఓట్లు పోలవడం నమ్మశక్యంగా లేదని, చరిత్రలో ఎన్నడూ జరగలేదని కాంగ్రెస్ వాదించింది.