UP Meerut Couple Divided By Gram Panchayat Because Of Their Parents Gotra Same: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంటను గ్రామ పెద్దలు విడదీశారు. ఇందుకు కారణం ఏంటో తెలుసా? వారి గోత్రం ఒక్కటి కావడమే! సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఆ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. మీరట్‌లోని ఓ కళాశాలలో శివమ్ అనే యువకుడు, తనూ అనే యువతి కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారు. దీంతో.. జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకొని, దైవ సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక తాము కోరుకున్నట్టుగా.. తమ సంసార జీవితాన్ని సుఖంగా గడపాలని అనుకున్నారు.
కానీ.. ఇంతలోనే ఆ యువ జంటకు గ్రామ పెద్దల నుంచి ఊహించని షాక్ తగిలింది. మీరిద్దరు కలిసి సంసారం చేయడానికి వీలు లేదంటూ.. వారిని వేరు చేశారు. అసలు ఈ పెళ్లే చెల్లదంటూ వారి వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు? అని ప్రశ్నిస్తే.. వారి దంపతుల గోత్రం ఒక్కటేనని, లెక్కప్రకారం వాళ్లు అన్నాచెల్లెలు అవుతారని గ్రామపెద్దలు చెప్పారు. అందువల్లే వారి వివాహాన్ని రద్దు చేస్తున్నామని తీర్పునిచ్చారు. దంపతుల గోత్రం ఒక్కటే ఉన్న వాళ్లు పెళ్లి చేసుకుంటే.. ఊరికి మంచిది కాదని అంటున్నారు. ఈ తీర్పుతో కేవలం ఆ జంట మాత్రమే కాదు.. ఇతరులు కూడా షాక్‌కి గురయ్యారు. గ్రామపెద్దల తీర్పుని వ్యతిరేకిస్తూ.. ఆ జంట పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో.. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, న్యాయం జరిగేలా చూస్తామని ఆ జంటకు హామీ ఇచ్చారు.