India Ranks 3rd Globally In Startup Ecosystem: భారత దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ లో అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్, యూనికార్న్ సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇండియా డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం 105 యూనికార్న్ ఉన్నాయని.. ఇందులో 2021లో 44 ఏర్పడితే.. 2022లో 19 ఏర్పడ్డాయని వెల్లడించారు. 2021-30 దశాబ్ధం భారతదేశ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో పరివర్తనాత్మక మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు.
గత కొన్నేళ్లుగా భారత్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై స్థూల వ్యయాన్ని మూడు రెట్లు పెంచిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం భారత్ లో 5 లక్షల మంది ఆర్ అండ్ డీ సిబ్బంది ఉన్నారని.. ఈ సంఖ్య గత ఎనిమిదేళ్లలో 40-50 శాతం పెరిగిందని వెల్లడించారు. పరిశోధన, అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం రెండింతలు అయినట్లు తెలిపారు. ప్రతీ ఏటా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల్లో ఇచ్చే పీ హెచ్ డీల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని.. అమెరికా, చైనా దేశాలు భారత్ కన్నా ముందున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారుతోందని వెల్లడించారు.
Read Also: COVID 19: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
స్టార్టప్స్ గురించి మాట్లాడుతూ.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఇండియాలో 75,000 స్టార్టప్స్ కు నిలయంగా ఉందని అన్నారు. నేడు భారత్ తో స్టార్టప్స్ మెట్రో నగరాలకే పరిమితం కాకుండా… 49 శాతం స్టార్టప్స్ టైర్ -2, టైర్-3 నగరాల్లోనే వెలుస్తున్నాయని తెలిపారు. దేశంలో ఐటీ, వ్యవసాయం, విద్యా, విమాన యానం, ఇంధనం, ఆరోగ్యం, అంతరిక్షం రంగాల్లో స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయని అన్నారు. ప్రపంచంలోనే టెక్నాలజీ లావాదేవీలకు అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులను ఆకర్షించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని.. అంతరిక్ష పరిశోధనల్లో మొదటి 5 దేశాల్లో భారత్ ఒకటని అన్నారు.
ప్రపంచంలోని 130 ఆర్థిక వ్యవస్థల్లో 2015 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెస్ట్ (జీఐఐ)లో భారత్ 81 స్థానంలో ఉంటే 2021లో 46వ స్థానానికి చేరిందని.. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రకారం 34 దిగువ మధ్య తరగతి ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 2వ స్థానంలో ఉందని.. 10 మధ్య తరగతి, దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థల్లో ఒకటో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు.