UN report: 2025 నాటికి భారతదేశ జనాభా 1.46 బిలియన్లకు (146 కోట్లు)కు చేరుకుందని ఐక్యరాజ్యసమితి (యూఎన్) జనాభా నివేదిక పేర్కొంది. అయితే, దేశంలో సంతానోత్పత్తి రేటు రీప్లేస్‌మెంట్ రేటు కన్నా తగ్గుతోందని వెల్లడించింది. UNFPA యొక్క 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ (SOWP) నివేదిక, ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్, సంతానోత్పత్తి తగ్గడం వల్ల కలిగే భయాందోళనల నుంచి పునరుత్పత్తి లక్ష్యాలను పరిష్కరించడం వైపు మారాలని పిలుపునిచ్చింది. లక్షలాది మంది ప్రజలు తమ నిజమైన సంతానోత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతున్నారని నివేదిక పేర్కొంది.
తక్కువ జనాభా లేదా అధిక జనాభా నిజమైన సంక్షోభం కాదని, సంతానోత్పత్తి తగ్గడమే నిజమైన సంక్షోభమని యూఎన్ రిపోర్టు చెప్పింది. జనాభా కూర్పు, సంతానోత్పత్తి, ఆయుర్దాయం వంటి కీలక మార్పులను కూడా నివేదిక వెల్లడించింది. ఇది ప్రధాన జనాభా మార్పును సూచిస్తోంది. భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు స్త్రీకి 1.9 జననాలకు తగ్గిందని, ఇది 2.1 భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉందని నివేదిక కనుగొంది. దీని అర్థం, ఒక తరం నుంచి మరొక తరానికి జనాభా పరిమాణాన్ని నిర్వహించడానికి అవసరమైన దాని కన్నా తక్కువ పిల్లల్ని కంటున్నట్లు చెబుతుంది.
Read Also: Austria school shooting: ఆస్ట్రియా స్కూల్‌లో ఉన్మాది కాల్పులు.. 8 మంది మృతి..
జనన రేటు మందగించినప్పటికీ, భారతదేశంలో యువత జనాభా గణనీయంగా ఉంది. 0-14 సంవత్సరాల వయస్సులో 24 శాతం, 10-19 సంవత్సరాల వయస్సులో 17 శాతం, 10-24 సంవత్సరాల వయస్సులో 26 శాతం మంది ఉన్నారు. దేశంలోని 68 శాతం జనాభా పని చేసే వయస్సు (15-64) కలిగి ఉంది. ఇది తగినంత ఉపాధి, పాలసీ సపోర్టుకు తగినంత జనాభాను అందిస్తుంది. వృద్ధుల జనాభా 65 ఏళ్లకు పైబడిన వారు కేవలం 7 శాతం మాత్రమే ఉన్నారు. అయితే, ఆయుర్దాయం మెరుగుపడటంతో రానున్న రోజుల్లో ఈ జనాభా మరింత పెరిగే అవకాశం ఉంది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, ప్రస్తుతం భారతదేశ జనాభా 146.39 కోట్లుగా ఉంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. జనాభా 170 కోట్లకు చేరిన తర్వాత మాత్రమే తగ్గుముఖం పడుతుందని నివేదిక చెప్పింది. ఇప్పటి నుంచి 40 ఏళ్ల తర్వాత ఇది సాధ్యమవుతుంది.