రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య రాజధాని కీవ్ లో మూతపడిన భారత రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం కానుంది. రష్యా దాడి తీవ్రమవుతున్న సమయంలో భారత రాయబార కార్యాలయాన్ని మార్చి 13 పోలాండ్ లోని వార్సాకు తరలించారు. తాజాగా మే 17 నుంచి కీవ్ లో ఎంబసీని తెరవనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ నుంచి పనిచేసేందుకు వివిధ పాశ్చాత్య దేశాలు సమాయత్తం అవుతున్న వేళ భారత్ కూడా తన ఎంబసీని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. రష్యా దాడి కారణంగా కీవ్ చాలా వరకు ధ్వంసం అయింది. అయితే భారత్ తన మిషన్లను ప్రారంభించేందుకు కీవ్ నుంచి ఎంబసీ కార్యక్రమాలు నిర్వహించనుంది.
యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 26న ‘ ఆపరేషన్ గంగా’ను ప్రారంభించింది. దాదాపుగా 20 వేల మంది భారతీయులను ప్రభుత్వం ప్రైవేటు విమానాలు, ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విమానాల ద్వారా స్వదేశానికి చేర్చారు. పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమానియా దేశాల మీదుగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు. అయితే కేవలం ఒకే భారతీయుడు, కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి మాత్రమే మరణించారు.
ఇదిలా ఉంటే గత రెండు నెలలుగా రష్యా, ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. దాదాపుగా కొన్ని వారాలు ప్రయత్నించినా.. రాజధాని కీవ్ ను రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకోలేకపోయాయి. దీంతో రష్యా అనేక భవనాలపై రాకెట్లతో విరుచుకుపడింది. కీవ్ తో పాటు మరో కీలక నగరం ఖార్కీవ్, ఎల్వీవ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలను రష్యా దారుణంగా దెబ్బతీసింది.