Uddhav Thackeray: శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని విమర్శించారు. బీజేపీ కొత్తగా ప్రారంభించిన ‘‘సౌగత్-ఏ-మోడీ’’ పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టి సత్తా జిహాద్(పవర్ జిహాద్)ని ఆశ్రయించిందని ఆరోపించారు. బీజేపీ పథకాన్ని ఠాక్రే ‘‘’సౌగత్-ఎ-సత్తా (అధికార బహుమతి)’’గా అభివర్ణించారు. బీహార్‌లో ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
బీజేపీ హిందుత్వాన్ని వదిలిపెట్టినట్లు ప్రకటించాలని, బుల్‌డోజర్ల ద్వారా ఇళ్లు కూల్చేసేసిన వారికి, మత అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన చాలా మందికి వారు అధికారం కోసం బహుమతులు పంచుతున్నారని, ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే అని, బీజేపీ సత్తా జిహాద్‌ని ఆశ్రయించిందని ఠాక్రే విమర్శించారు.
Read Also: Zelenskyy: ‘‘త్వరలో పుతిన్ చనిపోతారు’’.. జెలెన్స్కీ సంచలన ప్రకటన..
రంజాన్‌కి ముందు ఆర్థికంగా వెనకబడిన ముస్లిం కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ మంగళవారం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా ముస్లింలకు ప్రత్యేక పండగ కిట్‌లను పంపిణీ చేస్తోంది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఈ పథకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 32 లక్షల మందికి దీని వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈద్ కిట్లలో డ్రైఫ్రూట్స్, శనిగపిండి, రవ్వ, వెర్మిసెల్లి, చక్కెర వంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. పురుషుల కోసం కుర్తా పైజామా, మహిళల డ్రెస్ కోసం మెటీరియల్ అందిస్తున్నారు. ప్రతీ కిట్ కూడా రూ. 500-రూ.600 వరకు ఉంటుంది.
అయితే, ఈ పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి షామా మహ్మద్ ఈ కార్యక్రమాన్ని ‘‘కపట నాటకం’’గా అభివర్ణించారు. ముస్లిం సమాజాన్ని రాక్షసంగా చిత్రీకరించి , ఇళ్లు నేలమట్టం చేసి ఇప్పుడు గిఫ్ట్‌లు ఇస్తోందని విమర్శించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా బీజేపీ చర్యని రాజకీయ చర్యగా పిలిచారు. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ దీనిని ‘‘జోక్ ఆఫ్ ది డే’’గా అన్నారు.