Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతున్న వేళ జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది. ‘‘త్వరలోనే పుతిన్ చనిపోతారు’’ అని, ఇది రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపుకు సాయపడుతుందని అన్నారు. పారిస్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ పుతిన్ ఆరోగ్యం పరిస్థితులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అతను(పుతిన్) త్వరలోనే చనిపోతారు. ఇది యుద్ధాన్ని ముగిస్తుంది’’ అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశం తర్వాత విలేకరులతో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: BJP: డీ లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం.. బీజేపీ నాయకుల స్పందన
చాలా కాలంగా పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆయన నిరంతరం దగ్గుతున్నట్లు, అతడి చేతులు కాళ్లు అసంకల్పితంగా కదులుతున్నట్లు వీడియోల్లో కనిపించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. 2022లో ఒక వీడియోలో, మాజీ రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన సమావేశంలో పుతిన్ తన కుర్చీలో వంగి టేబుల్ పట్టుకున్నట్లు చూపించాయి. పుతిన్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు నివేదికలు వచ్చాయి. అయితే, క్రెమ్లిన్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ నివేదికలు తప్పు అని ఖండించింది.
శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, రష్యా వివాదాన్ని పెద్దది చేయాలని చూస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా ఈ యుద్ధం కొనసాగాలని చూస్తోందని, ప్రపంచదేశాలు యుద్ధం ముగిసేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. మరోవైపు, రష్యా, ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియా జెడ్డా వేదికగా శాంతి చర్చలు జరుపుతున్నారు. యుద్ధం ముగించాలని రష్యా కూడా కోరుకుంటోంది.