NTV Telugu Site icon

Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో మేం కలిసి పోరాడుతాం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..

Mva

Mva

Sharad Pawar: ఈ ఏడాది చివర్లో అక్టోబర్-నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి(ఏంవీఏ) సిద్ధం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ(ఎస్) పార్టీలు కలిసి పోటీ చేస్తాయని శరద్ పవార్ ఆదివారం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ సర్కార్‌ని గద్దె దించాలని అనుకుంటోంది. మహాయుతిలో బీజేపీ, శివసేన్(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలు ఉన్నాయి.

Read Also: Dating App Scams: డేట్ అని అమ్మాయిని కలవడానికి వెళ్లారో, జేబు ఖాళీ.. వెలుగులోకి “డేటింగ్ స్కామ్”..

విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే కలిపి పోరాడుతామని చెప్పారు. సీట్ల కేటాయింపుపై త్వరలో చర్చిస్తామని, తమకు మూడు నెలల సమయం ఉందని చెప్పారు. ప్రతిపక్ష కూటమికి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలు మంచి ఊపును ఇచ్చాయి. 48 ఎంపీ స్థానాలతో యూపీ తర్వాత కీలకంగా ఉన్న మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి 31 స్థానాలను గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 13, శివసేన(ఉద్ధవ్) 09, ఎన్సీపీ(శరద్ పవార్) 08 స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్డీయే కూటమి కేవలం 17 చోట్ల మాత్రమే విజయం సాధించింది.

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో చీలికలు వచ్చాయి. 2019 నుంచి 2022 వరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నాయి. అయితే, శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటులో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీతో చేతులు కలిపి ఏక్‌నాథ్ షిండే సీఎంగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత పరిణామాల్లో ఎన్సీపీలో కూడా చీలిక వచ్చింది. శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి అజిత్ పవార్ బీజేపీ సర్కారుకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి.