Tyre Burst Not Act Of God: కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన పటిషన్ ను బాంబే హైకోర్ట్ కోట్టేసింది. బాధిత కుటుంబానికి డబ్బు చెల్లించాల్సిందే అని తీర్పు చెప్పింది. టైర్ పగిలిపోవడం ‘‘యాక్ట్ ఆఫ్ గాడ్’’ కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో చనిపోయిన వ్యక్తిపైనే కుటుంబం ఆధారపడి ఉందని పేర్కొంది. బాధిత కుటుంబానికి రూ. 1.25 కోట్లను చెల్లించాలని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ను ఆదేశించింది.
Read Also: VIRAT KOHLI : సెంచరీతో కదం తొక్కిన విరాట్.. 400 దాటేసిన భారత్..
వివరాల్లోకి వెళితే మరణించిన వ్యక్తి మకరంద్ పట్వర్ధన్ అక్టోబర్ 25, 2010న తన ఇద్దరు సహోద్యుగులతో పూణే నుంచి ముంబై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మకరంద్ అక్కడిక్కడే చనిపోయాడు. కారు యజమాని, సహోద్యోగి అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడపడంతో వెనక టైర్ పగిలి కారు ఒక్కసారిగా ఓ గుంతలోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. అయితే పట్వర్ధన్ కుటుంబానికి రూ. 1.25 కోట్లు చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ 2016లో తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై సదరు ఇన్సూరెన్స్ సంస్థ పరిహారం మొత్తం ఎక్కువగా ఉందని చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టులో ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఇన్సూరెన్స్ కంపెనీ వాదించింది. దీనిపై కోర్టు ఘాటుగానే స్పందించింది. అనియంత్రితంగా సహజ శక్తుల వల్ల ఈ ప్రమాదం జరిగిందా..? అంటూ ప్రశ్నించింది. టైర్ పగిలిపోవడాన్ని దేవుడి చర్యగా చూడలేమని, ఇది మానవ నిర్లక్ష్యమే అని కోర్టు పేర్కొంది. టైర్ పేలడానికి అధిక వేగం, తక్కువ గాలి, సెకండ్ హ్యాండ్ టైర్లు ఇలా అనేక కారణాలు ఉంటాయని పేర్కొంది. వాహనం బయలుదేరే ముందు యజమాని, డ్రైవర్ తనిఖీ చేయాలి, టైర్ల పరిస్థితిని తెలుసుకోవాలి, టైర్ పగిలిపోవడాన్ని సహజచర్యగా పేర్కొనలేము, ఇది మానవనిర్లక్ష్యం అని చెప్పింది. యాక్ట్ ఆఫ్ గాడ్ గా చెబుతూ.. బీమా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడానికి వీలు లేదని తీర్పు చెప్పింది.