బీజేపీ మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పలు నగరాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత జరిగిన ఈ ప్రదర్శనలు కొన్ని చోట్ల హింసకు దారితీశాయి. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించిన ఆందోళనల్లో హింస చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది వరకూ గాయపడ్డారు. తీవ్ర గాయాలతో తమ ఆస్పత్రిలో చేరిన ఇద్దరు మృతిచెందినట్టు రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు ధ్రువీకరించారు.
ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసుల ప్రయత్నించడంతో ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఓ వర్గం రాళ్లు రువ్వడంతో హింసాత్మకంగా మారింది. వారిని అదుపుచేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. భారీగా చేరుకున్న ఆందోళనకారులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హింస చేలరేగడంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా బలగాలను మోహరించారు. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు.
దేశవ్యాప్తంగా పలు మసీదుల్లో ముస్లింలు నిరసన తెలిపారు. హైదరాబాద్ మక్కా మసీదులో ప్రార్థన తరువాత ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పాటు ఢిల్లీలోని జామా మసీదులో కూడా ఇలాగే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపుగా 300 మంది ప్రార్థనలు ముగిసిన తరువాత రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. జామా మసీద్ షాహీ ఇమామ్.. తాము ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వలేదని.. వారంతా ఎంఐఎం, అసదుద్దీన్ మనునుషులు కావచ్చని అభిప్రాయపడ్డారు. నిరసన తెలిపితే తెలపవచ్చు కానీ మేమే వీటికి మద్దతు ఇవ్వమని ఇమామ్ అన్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ షహరాన్ పూర్‌లో కూడా ఉద్రిక్తత తలెత్తింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో, కాన్పూర్, ఫిరోజాబాద్ పట్టణాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలపై కాన్పూర్‌లో ఇటీవల ఘర్షణలు తెలెత్తాయి. కాన్పూర్‌లో జరిగిన రాళ్లదాడిలో 40 మంది వరకు గాయపడ్డారు. అలాగే, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర, యూపీ, తెలంగాణలోనూ ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
నుపుర్ శర్శ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ చర్యలు కూడా తీసుకుంది. ఇప్పటికే వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యల అనంతరం పలు ఉగ్రవాద సంస్థల నుంచి నుపుర్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెకు భద్రతను పెంచారు.