మధ్యప్రదేశ్‌లో దేవా అనే గిరిజన యువకుడు లాకప్ డెత్ తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గుణలో పార్ధి వర్గానికి చెందిన 25 ఏళ్ల గిరిజన యువకుడు పోలీస్ కస్టడీలో మరణించాడు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు బట్టలు విప్పి నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కొంతమంది మహిళా బంధువులు తీవ్ర నిరసనతో తమ బట్టలు విప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళలు కలెక్టరేట్ కార్యాలయం లోపలకి చొచ్చుకొచ్చారు. ఇంకొందరు నేలమీద పడి బోరున విలపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని బయటకు పంపేందుకు ప్రయత్నించగా అధికారులతో ఘర్షణకు దిగారు. ఈ తోపులాటలో ఒక మహిళ తలకు తీవ్ర రక్తస్రావం అయింది. ఒక పోలీస్ కూడా గాయపడ్డారు. మరికొందరి మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి.
దేవా గుండెపోటుతో మృతి చెందాడన్న అధికారుల వాదనను గిరిపుత్రులు తోసిపుచ్చారు. పోలీస్ దెబ్బలకు చనిపోయాడని బంధువులు ఆరోపించారు. గుండెపోటుతో చిన్న పిల్లాడు ఎలా చనిపోతాడని… పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడని దేవా మామ గంగారాం ఆరోపించారు.
దేవాది ఆదివారం బారాత్ జరగనుంది.. వివాహ ఊరేగింపునకు సిద్ధపడుతున్నారు. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. చివరి ఫొటో సాయంత్రం 4:30గంటలకు దేవా దిగాడు. ఇంతలో పోలీసులు వచ్చి దొంగతనం కేసులో దేవాను, అతడి మామ గంగారాంను పోలీసులు తీసుకెళ్లారు. అంతలోనే ఆదివారం రాత్రి దేవా చనిపోయాడని కుటుంబ సభ్యులకు పోలీసులు ఫోన్‌లో తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇదిలా ఉంటే వధువు అప్పటికే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అలాగే అత్త సూరజ్‌బాయి కూడా నిప్పంటించుకుంది. ఈ పరిస్థితుల్లో అందరూ ఆందోళనలో ఉండగా… దేవా చనిపోయాడని వార్త రావడంతో మరింత కుంగిపోయారు. దీంతో పెద్ద ఎత్తున బంధువులు కలెక్టరేట్‌కు వెళ్లి ఆందోళన చేశారు.
గ్రామంలో జరిగిన దొంగతనంపై ప్రశ్నించినందుకే దేవా, గంగారామ్‌లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. దొంగిలించబడిన వస్తువులను రికవరీ చేసే సమయంలో దేవా ఛాతీ నొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వెంటనే మయానా ఆసుపత్రికి, అటు తర్వాత జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. వైద్యులు 45 నిమిషాల పాటు సీపీఆర్‌ను అందించారని.. కానీ అప్పటికే అతడు మృతిచెందాడన్నారు. అయితే దేవాపై వివిధ పోలీసు స్టేషన్లలో ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఇక బాధితుల కుటుంబం భోపాల్‌లో శవపరీక్ష చేయాలని కోరింది.. అయితే అధికారుల హామీ తర్వాత మెజిస్టీరియల్ విచారణకు బంధువులు అంగీకరించారు.