Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి తర్వాత కాశ్మీర్ టూరిజానికి ఆశ, ఊపిరిని తీసుకుస్తూ మళ్లీ పర్యాటకులు వస్తున్నారు. హహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించిన తర్వాత టూరిస్టుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, ఎలాంటి భయాలు లేకుండా టూరిస్టులు పర్యాటక ప్రాంతాలకు వస్తుండటం స్థానికుల్లో ఆనందానికి కారణమవుతోంది. గతంలో పోలిస్తే పర్యాటకుల సంఖ్య తగ్గినప్పటికీ, ఈ ప్రాంతం మరోసారి దేశీయ , అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించడం ప్రారంభించింది.
ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన పహల్గామ్ ఏరియాకు రోజుకు 5000-7000 మంది సందర్శకులు వచ్చే వారు, ఈ ఘటన తర్వాత ప్రస్తుతం 100 మంది పర్యాటకులు మాత్రమే కనిపిస్తున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే ఈ సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దాడి జరిగిన బైసరిన్ ప్రాంతానికి మినహా అన్ని ప్రాంతాల్లోకి వెళ్లేందుకు పర్యాటకులకు అనుమతి ఉంది.
మన దేశం నుంచే కాకుండా క్రొయేషియా, సెర్చిమా నుంచి కూడా పర్యటకులు వచ్చారు. క్రొయేషియాకు చెందిన వ్లాట్కో అనే టూరిస్ట్ మాట్లాడుతూ.. ‘‘కాశ్మీర్‌లో నేను 10వ సారి వచ్చాను. ప్రతిసారీ ఇది అద్భుతంగా ఉంటుంది. నాకు, ఇది ప్రపంచంలోనే నంబర్ వన్, సహజమైన, మృదువైన ప్రజలు. నా బృందం చాలా సంతోషంగా ఉంది, వీరు తొలిసారి కాశ్మీర్ వచ్చారు’’ అని చెప్పాడు.
క్రొయేషియాకు చెందిన మరో పర్యాటకుడు అడ్మిర్ జాహిక్ కూడా కూడా ఇదే విధంగా స్పందించారు. దాడి గురించి అడిగిన సందర్భంలో ‘‘నాకు ఎలాంటి భయం అనిపించడం లేదు. ఇది ఇక్కడ తరుచు జరిగే విషయం కాదని నాకు తెలుసు. మీరు భయపడితే ఇంట్లోనే ఉండొచ్చు, కానీ అది మీ ఇంట్లో కూడా జరగొచ్చని. ఇది యూరప్‌లో కూడా జరుగుతుంది. ప్రతీచోట జరుగుతుంది. ప్రపంచంలో ఇకపై సురక్షితమైన స్థలం లేదు’’ అని చెప్పాడు.