Trinamool congress: పశ్చిమ బెంగాల్లో సీఎం సువేందు అధికారి దూకుడుకు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కకావికలం అవుతోంది. గత 15 ఏళ్లుగా టీఎంసీ నేతలు, కార్యకర్తలు చేసిన అరాచకాలపై బీజేపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాలకు పాల్పడిన నేతలందర్ని వరసగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి, భయంలో ఉన్నారు. చాలా మంది తృణమూల్‌ను వీడుతున్నారు. పార్టీలో కూడా అంతర్ఘత కలహాలు మొదలయ్యాయి.
ఎంపీలు కాకోలి ఘోష్ దస్తిదార్, కళ్యాణ్ బెనర్జీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బెనర్జీ మహిళల్ని గౌరవించరని కాకోలి సంచలన ఆరోపణలు చేశారు. నారద స్కామ్ సీబీఐ విచారణకు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తోందని బెనర్జీ ఆరోపిస్తున్నారు. లోక్‌సభ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీపై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఘోష్ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు.
వరస రాజీనామాలు:
ఇదిలా ఉంటే బెంగాల్ వ్యాప్తంగా 15 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల నుంచి సుమారు 127 మంది టీఎంసీ నాయకులు, కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇక మమతా బెనర్జీ నిర్వహించే నిరసన కార్యక్రమాలకు 80 మంది ఎమ్యెల్యేల్లో 36 మంది మాత్రమే హాజరయ్యారు. ఇది టీఎంసీలో సంక్షోభాన్ని సూచిస్తోంది.
ఇక సీఎం సువేందు అధికారి, మంత్రి నిషిత్ ప్రమణిక్‌తో పాటు బీజేపీ నాయకులతో టీఎంసీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరవుతున్నారు. దీనిని బట్టి చూస్తే బీజేపీ గేట్లు తెరిస్తే టీఎంసీ ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
వరస అరెస్టులు:
15 ఏళ్లుగా సాగిన టీఎంసీ అరాచకాలపై బీజేపీ సర్కార్ దృష్టి సారించింది. భూముల ఆక్రమణ, కట్ మనీ వ్యవహారం వంటి కార్యకలాపాలకు పాల్పడిన టీఎంసీ నాయకులపై సర్కార్ కఠినంగా వ్యవహిస్తోంది. టీఎంసీ ఎమ్మెల్యే దిలీప్ మండల్‌ను అరెస్ట్ చేశారు. బసిర్హట్ లోని టీఎంసీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ పొలాల్లో బంగారం, నగదు లభ్యం కావడంతో ఈ అరెస్ట్ జరిగింది. కూచ్ బెహార్‌లో సువేందు కాన్వాయ్‌పై దాడి చేసిన టీఎంసీ నేతలు తన్మోయ్ దాస్, సుబ్రతా ఆచార్యలను అరెస్ట్ చేశారు.
ఉత్తర 24 పరగణాల జిల్లాలో అజిత్ సాహా, సుజిత్ సాహాల ఇళ్ల నుంచి కరెన్సీ, రైఫిళ్లు, తూటాలు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. హుగ్లీ టీఎంసీ జోనల్ చైర్మన్ సుఖ్‌దేవ్ మహతోను అరెస్ట్ చేశారు. బిధాన్నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన నలుగురు టీఎంసీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. మాజీ మంత్రి సుజిత్ బోస్‌ను సౌత్ డుమ్ డుమ్ మున్సిపాలిటీ నుండి అరెస్టు చేశారు. బర్ధమాన్ మున్సిపాలిటీకి చెందిన టీఎంసీ కౌన్సిలర్ షహాబుద్దీన్ ఖాన్, మాతాభంగా మున్సిపాలిటీకి చెందిన చంద్రశేఖర్ రాయ్, మరియు హౌరాకు చెందిన టీఎంసీ నాయకుడు ఆకాష్ సింగ్‌లను అరెస్టు చేశారు.
బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు.?
ఇదిలా ఉంటే బీజేపీలో చేరేందుకు కీలక నాయకులు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర అధిష్టానం నుంచి పచ్చజెండా ఊపితే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపుగా 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ తెలిపారు. మల్దా, ముర్షిదాబాద్, దక్షిణ బెంగాల్‌కు చెందిన 50 మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో సహా కీలక నేతలు కాషాయ పార్టీలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
