Yogi Adityanath: మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలోని కుమార్తెల భద్రతకు హాని కలిగించే ప్రయత్నం చేసేవారు రావణుడి పరిస్థితి ఎదుర్కొంటారని శుక్రవారం వార్నింగ్ ఇచ్చారు. బల్లియా జిల్లాలోని బన్స్‌దీహ్‌లో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళన్‌లో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ, ‘ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన’ను రాబోయే సెషన్ నుండి రూ. 25,000 ఇవ్వడం ద్వారా రాష్ట్ర కుమార్తెల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడానికి నిబద్ధతతో ఉందని ఆయన అన్నారు. ఈ డబ్బును ఆరు దశల్లో ఆడపిల్లల తల్లిదండ్రులకు అందచేస్తామని ఆయన అన్నారు.
అర్హులైన కుటుంబాలకు వారి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన’ కింద రూ.51,000 ఇస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే రావణుడు, కంసుడి గతి పడుతుందని, తీవ్ర పరిణామాలు చవిచూస్తారని అన్నారు.
Read Also: Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ..
ఈ సందర్భంగా బల్లియాలో రూ. 129 కోట్లతో చేపట్టిన 35 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అర్హులకు ధ్రువపత్రాలను అందించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం దీపావళి రోజు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తుందని, వంట పొయ్యిల నుంచి వచ్చే పొగ హానికరమైన ప్రభావాల నుంచి రాష్ట్ర మహిళలకు ఉపశమనం కల్పించడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 1.75 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం పొందుతారని యోగీ తెలిపారు.
2026 డీలిమిటేషన్ తర్వాత లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇందుకు ప్రధాని మోడీకి థాంక్స్ చెప్పాలని ఆయన అన్నారు. మహిళల భద్రత, గౌరవం మరియు స్వావలంబనను నిర్ధారించడమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని నొక్కిచెప్పిన ఆదిత్యనాథ్, తమ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు బలగాలలో 20 శాతం మహిళా సిబ్బందిని ప్రాధాన్యతా ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్ చేసేలా వ్యవహరిస్తోందని అన్నారు.