Heat Wave Warning: ఏప్రిల్ రెండో వారమే దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ(IMD) వచ్చే పది రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉంటే వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.
Read Also: Maheshwer reddy: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డి..
రానున్న 4-5 రోజుల్లో ఈశాన్య భారతంతో పాటు పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సాధారణం కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 13 నుంచి 17 వరకు గంగా తీర పశ్చిమ బెంగాల్, 13 నుంచి 15 మధ్య ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్ 15-17 మధ్య బీహార్ మీదుగా హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల్లో గోవా, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఐఎండీ ప్రకారం 1901లో నుంచి ఈ ఏడాది ఫిబ్రవరినే హాటెస్ట్ ఫిబ్రవరిగా నమోదు అయింది. దేశ రాజధాని ఢిల్లీలో వడగాలుల కారణంగా పాఠశాలల సన్నద్ధతపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీరప్రాంతాల్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా అన్ని అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఏప్రిల్ 12 నుంచి 16 వరకు మూసేయాలని ఆదేశించారు. మరోవైపు ఏసీలు, ఏయిర్ కూలర్ల వినియోగం పెరగడంతో విద్యుత్ వినియోగం గరిష్టానికి చేరుకుంది. దీంతో పవర్ లోడ్ ఎక్కువగా అవుతోంది.