తమిళనాడులో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారి కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు దేశం మొత్తంమీద 20.57 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయడం విశేషం. ఇక తమిళనాడులో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. రోజుకు లక్షకు పైగా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉచితంగా టీకా వేస్తామని హామీ ఇచ్చింది డిఎంకే. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్నది. అయితే, ఉచితంగా టీకా అందిస్తున్న టీకా విషయంలో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపక పోవడంతో మంత్రులు రంగంలోకి దగి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వేలూరు జిల్లాలోని వాణియంబాడిలోని జైన్ సంఘంలో ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి దురైమురుగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ పై సందేహాలు అవసరం లేదని, వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరు తీసుకొవాలని, తనకు కరోనా వచ్చినప్పటికి వ్యాక్సిన్ తీసుకోవడం వలనే కోలుకున్నానని మంత్రి పేర్కొన్నారు.