Supreme Court: గత కొంత కాలంగా జాతీయ విద్యా విధానం(NEP), ‘‘త్రి భాష విధానం’’పై కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదమే చెలరేగుతోంది. హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే పార్టీతో పాటు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము ‘‘తమిళ్, ఇంగ్లీష్ ద్వి భాష విధానాన్ని’’ అమలు చేస్తామని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్‌లో, ఈ రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగా NEPని స్వీకరించడానికి, దాని అమలు కోసం ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోవడానికి బాధ్యత వహిస్తాయని వాదించారు.
Read Also: Indians In US: బిక్కుబిక్కుమంటున్న భారతీయులు.. యూఎస్ నుంచి ‘‘సెల్ఫ్ డిపొర్టేషన్’’ భయం..
హిందీని సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పిల్ సుప్రీంకోర్టులో దాఖలైంది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్రం ఎన్ఈపీని ప్రయోగిస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఈ వాదనల్ని మణి పిటిషన్ తోసిపుచ్చింది. స్టాలిన్ వ్యతిరేకత తప్పుడు, ఏకపక్షమైందిగా, రాజకీయంగా ప్రేరేపితమైనదిగా, ఉచిత మరియు ప్రభావవంతమైన విద్యను పొందే ప్రాథమిక హక్కుకు వ్యతిరేకం అని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విధానాన్ని ఆమోదించమని నేరుగా బలవంతం చేయలేకపోయినా, రాజ్యాంగ నిబంధనలు లేదా చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఆదేశాలు జారీ చేసే అధికారం దానికి ఉందని తాజా పిటిషన్ వాదిస్తుంది. కొన్ని సందర్భాల్లో, అటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవలసిన అవసరం ఏర్పడటానికి దారితీయవచ్చని మణి చెబుతున్నారు. ఈ పిటిషన్‌ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించాల్సి ఉంది.