SIR: కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ప్రక్షాళన కోసం చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ తమిళనాడులో నకిలీ ఓటర్లపై పంజా విసిరింది. తమిళనాడులో సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ఈరోజు(డిసెంబర్ 19)న విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన వారు 6,94,672 మంది, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు 66,44,881 మంది, ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటు ఉన్నవారు 3,39,278 మంది ఓటర్లు ఉన్నారని డేటా పేర్కొంది.
Read Also: Bangladesh: “శుక్రవారం ఘటన బంగ్లాదేశ్‌ను షేక్ చేస్తుంది”.. గర్ల్‌ఫ్రెండ్‌తో “హదీ” హత్యా నిందితుడు..
ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమిళనాడులో 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.66 కోట్ల మంది పురుషులు, 2.77 కోట్ల మంది మహిళలు, 7,191 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. ఓటర్ జాబితా ప్రక్షాళణకు ముందు తమిళనాడులో 6.41 కోట్ల ఓటర్లు ఉండే వారు. రాజధాని చెన్నైలోనే ఏకంగా 14.25 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దిండిగల్ జిల్లాలో 2.34 లక్షల ఓట్లను తొలగించారు. కరూరులో 79,690 మందిని, కాంచీపురం జిల్లాలో 2.74 లక్షల మందిని తొలగించారు. షోలింగనల్లూరు, పల్లవరం నియోజకవర్గాల్లో అత్యధిక మంది ఓటర్లను తొలగించినట్లు జాబితా తెలిపింది.
ముసాయిదా ఓటర్ల జాబితాపై అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామి స్పందించారు. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు నివేదికలు వస్తున్నాయని, వీటిలో చాలా వరకు నకిలీ ఓట్లే అని, అందుకే ఎస్ఐఆర్‌ను తమ పార్టీ సపోర్ట్ చేసిందని అన్నారు. నకిలీ ఓట్లను ఉపయోగించి, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసి, అధికారంలోకి రావాలనుకునే డీఎంకే కల చెదిరిపోయిందని, ఆందోళనలు చేస్తూ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.
