Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. పలు దేశాధినేతలు మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ కష్టకాలంలో భారత్‌కి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ భయంకరమైన ఉగ్ర దాడిపై స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ ఖహార్ బాల్ఖీ బుధవారం ఎక్స్ వేదికగా తాలిబన్ ప్రభుత్వ ప్రకటనను పోస్ట్ చేశారు. ‘‘జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని IEA విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండిస్తోంది మరియు ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తోంది. ఇటువంటి చర్యలు ఈ ప్రాంతం యొక్క భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయి.’’ అని ఆప్ఘనిస్తాన్ స్పందించింది.
ఈ ఉగ్రదాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ నాయకులు భారతదేశానికి సంఘీభావం తెలిపారు. పాకిస్తాన్, చైనా, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు శ్రీలంక విదేశాంగ కార్యాలయాల నుండి సంతాప సందేశాలు వచ్చాయి. ముస్లిం వరల్డ్ లీగ్ కూడా ఈ దాడిని ఖండించింది.
