Swati Maliwal Demands Haryana Govt To Take Dera Baba Parole Back: 2017లో అత్యాచారం, ఓ జర్నలిస్టుని హత్య చేసిన కేసుల్లో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా.. యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఆయన పెరోల్‌పై అప్పుడప్పుడు బయటకు వస్తున్నాడు. ఇదివరకే నాలుగుసార్లు పెరోల్‌పై బయటకు వచ్చిన డేరా బాబాకు ఇటీవల కోర్టు మరోసారి 40 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఇలా బయటకు రాగానే డేరా బాబా దీపావళి సందర్భంగా ‘Sadi Nit Diwali’ పేరిట ఒక పాటని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అది వెంటనే వైరల్‌గా మారింది. 24 గంటల వ్యవధిలోనే 42 లక్షల వ్యూస్ కొల్లగొట్టింది. అక్కడితో డేరా బాబా ఆగలేదు. జైలు నుంచి బయటకొచ్చిన ప్రతిసారి చేసినట్టుగానే.. ఈసారి కూడా ఆన్లైన్ సత్సంగాలు గుప్పిస్తున్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా ఈ సత్సంగాలకు హాజరవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇదిలావుండగా.. డేరా బాబాకి పెరోల్ ఇవ్వడంపై కొందరు మండిపడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్విటర్ మాధ్యమంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా, బ్రిటన్ తరహాలోనే భారత్‌లో కూడా పెరోల్ రిజిస్ట్రేషన్‌ను కోడిఫైడ్ చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు పక్షపాతంతో కొద్దిమందిని మాత్రమే ఎంపిక చేసే విధంగా పెరోల్ విధానం ఉండకూడదని అన్నారు. చట్టాన్ని మార్చాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆమెతో పాటు డీసీడబ్ల్యూ (ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్) చీఫ్ స్వాతి మలివాల్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. డేరా బాబా ఒక హంతకుడని, ఎందరో మహిళ జీవితాల్ని నాశనం చేసిన దుర్మార్గుడని పేర్కొంది. కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తే.. హర్యానా ప్రభుత్వం మాత్రం ఎప్పుడుపడితే అప్పుడు పెరోల్ ఇస్తోందని ఆరోపించింది. బయటకొచ్చాక సత్సంగులు నిర్వహిస్తున్నాడని, వాటికి డిప్యూటీ స్పీకర్‌తో పాటు మేయర్ కూడా హాజరయ్యారని పేర్కొంది. డేరా బాబా పెరోల్‌ని వెంటనే వెనక్కు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని కోరింది.
ఓవైపు ఇంత రచ్చ జరుగుతుంటే.. మరోవైపు డేరా బాబా మాత్రం తనకేం ఎరుగనట్టుగా తన పనుల్లో తాను ఉన్నాడు. తన దత్తపుత్రికగా ప్రకటించిన హనీప్రీత్ ఇన్సాన్కు కొత్త పేరు పెట్టారు. ఇకపై ఆమె ‘రుహానీ దీదీ’గా ప్రసిద్ధికెక్కుతుందని చెప్పాడు. ‘‘మా అమ్మాయి పేరు హనీప్రీత్. అయితే.. ప్రతిఒక్కరూ ఆమెను దీదీ అని పిలుస్తుంటారు. దాంతో అసలు పేరుపై కాస్త గందరగోళం నెలకొంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ‘రుహానీ దీదీ’ అని పేరు పెట్టాం’’ అని వివరించాడు.