Swati Maliwal assault: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ సభ్యురాలు స్వాలి మలివాల్‌పై దాడి ఆ పార్టీని ఇరకాటంలో పెట్టింది. సోమవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. ఈదాడిపై ఆమె రెండు సార్లు ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయలేదు. మరోవైపు ఆప్ ఆమెపై దాడి జరిగినట్లు క్లారిటీ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ దాడిని ఆప్ ఖండిస్తోందని, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బుధవారం స్వాతిమలివాల్‌ని సంజయ్ సింగ్ ఆమె ఇంట్లో కలుసుకున్నారు.
Read Also: BMW M 1000 XR Launch : అదిరిపోయే ఫీచర్లతో బీఎండబ్ల్యూ బైక్.. ధర ఎంతంటే?
ఇదిలా ఉంటే ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఆప్‌పై విమర్శలు గుప్పిస్తోంది. కేజ్రీవాల్ అతని సన్నిహితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఢిల్లీ పోలీసులు ఈ దాడి గురించిన వివరాలు ఆరా తీసేందుకు స్వాతి మలివాల్ నివాసానికి వెళ్లారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) ర్యాంక్ అధికారి నేతృత్వంలోని పోలీసు బృందం దాదాపు నాలుగు గంటలపాటు రాజ్యసభ ఎంపి నుండి వివరాలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతకుముందు సోమవారం ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పోలీస్ స్టేషన్ వెళ్లి కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆరోపించారు. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరోవైపు విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ (NCW) బిభవ్ కుమార్‌కు సమన్లు పంపింది. ఈ విషయంపై ఇప్పటి వరకు కేజ్రీవాల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.